
బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు సీబీఐ షాకిచ్చింది. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిని పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం తేజస్వీ యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది.
ALso REad:బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాల్లో ఐక్యత అవసరం - బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్
కాగా.. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా వుండగా జరిగిన పలు రైల్వే కుంభకోణాలకు సంబంధించి సీబీఐ ఇటీవల పలువురు ఆర్జేడీ నేతల ఇళ్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాంచీ, పూరిలలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టులు ఇచ్చినందుకు గాను.. ఓ ప్రైవేట్ సంస్థ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి పాట్నాలో విలువైన భూమిని ముడుపులుగా ఇచ్చిందని సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ ఆరోపణలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి లాలూ సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లతో పాటు 12 మందిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్‌లకు 2018లో బెయిల్ మంజూరైంది.
అయితే ఈ కేసులో తాజా తనిఖీలకు సంబంధించి తేజస్వీ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అధికారులు రిటైర్ కారా, ఎల్లకాలం బీజేపీయే అధికారంలో వుంటుందా అని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తు ఏజెన్సీలు రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వర్తించాలని తేజస్వీ యాదవ్ సూచించారు. ఈ క్రమంలోనే సీబీఐ ఆయన బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోర్టును కోరింది.