Manikrao Gavit : కేంద్ర మాజీ మంత్రి మాణిక్‌రావు గవిత్ క‌న్నుమూత..

By team teluguFirst Published Sep 17, 2022, 4:32 PM IST
Highlights

రెండు సార్లు కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాణిక్‌రావు గవిత్‌ తన 87 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చనిపోయారు. ఆయన మహారాష్ట్రలోని నందూర్‌బార్ లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మాణిక్‌రావు గవిత్‌ శనివారం కన్నుమూశారు. 87 ఏళ్ల వయసులో నాసిక్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమార్తె మాజీ ఎమ్మెల్యే నిర్మలా గవిత్‌, కుమారుడు భరత్‌ ఉన్నారు.

మాణిక్ రావు గవిత్ 1980 నుండి 2014 వరకు గిరిజనులు అధికంగా ఉండే నందూర్‌బార్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. దీని తర్వాత 2019లో గవిత్ కుమారుడు భరత్‌కు కాంగ్రెస్ టిక్కెట్టు నిరాక‌రించింది. దీంతో ఆయ‌న బీజేపీలో చేరారు.

మోడీ హయాంలో లీకేజ్‌లు లేవు.. కేంద్రం ఎంత ఇస్తే అంత నేరుగా పేదల ఖాతాల్లోకి : నిర్మల

కాగా.. గవిత్ కుమార్తె నిర్మల ఇగత్‌పురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె శివసేనలో చేరి ఎన్నికల్లో ఓడిపోయారు. గవిత్ 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ప‌ని చేశారు. అలాగే 2013లో సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రిగా సేవ‌లు అందించారు. లోక్ స‌భ తాత్కాలిక స్పీక‌ర్ గా కూడా ప‌ని చేశారు. 

భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలకు నిర్ణయాత్మక ఘట్టం- కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జైరాం రమేష్

మాణిక్‌రావు గవిత్ 1934 అక్టోబరు 29న నందుర్‌బార్ జిల్లాలోని ధుదిపాడలో జన్మించారు. నందూర్‌బార్ జిల్లాకు వరుసగా 30 ఏళ్లుగా ఎంపీగా కొనసాగిన తొలి నాయ‌కుడు ఆయ‌నే.  వరుసగా 9 సార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. అలాగే పార్టీ నుంచి వరుసగా పదోసారి టిక్కెట్‌ పొందిన సీనియర్‌ నేతల జాబితాలో కూడా ఆయన పేరు ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పార్ల‌మెంట్ లో కూడా అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. 

పార్టీ కార్యకర్తలు ఆయ‌న‌ను ‘దాదాసాహెబ్‌’గా పిలిచేవారు. ఆయ‌న 1965లో గ్రామపంచాయతీ ఎన్నిక‌ల నుంచి రాజకీయాల్లోకి ప్ర‌వేశించారు. మాణిక్రావ్ గవిత్‌కు మన్మోహన్ సింగ్ ప్ర‌భుత్వంలో అడ‌గ‌కుండానే మొదటిసారి మంత్రి పదవి లభించింది. అయితే ఆయ‌న‌కు మంత్రి పదవి వచ్చిందని టీవీ ద్వారా తెలియ‌డం ఇక్క‌డ విశేషం. కేంద్ర మంత్రి అయినప్పటికి ఆయనది సాధారణ జీవితాన్నే గడిపారు.

ప్రధాని మోడీపై యూఎస్ మీడియా ప్రశంసలు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆ మాట అన్నందుకే..!

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌పడుతున్న మాణిక్‌రావు శ‌నివారం ఉద‌యం చ‌నిపోయారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కుమారుడు భరత్ గవిత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మాణిక్‌రావు మృతితో నందూర్‌బార్ జిల్లాలో విషాద వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ధూళిపాడులోని ఆయ‌న వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 

click me!