ఓటేయడమే చివరి కోరిక.. ఓటు వేసిన అరగంటకు 105 ఏళ్ల వ్యక్తి కన్నుమూత.. ఎక్కడంటే?

By Mahesh KFirst Published May 17, 2022, 6:12 PM IST
Highlights

జార్ఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని 105 ఏళ్ల ఓ వృద్ధుడు తన చివరి కోరికగా కొడుకులకు చెప్పాడు. కొడుకు షాక్ అయ్యారు. వద్దని వారించారు. కానీ, ఆ వృద్ధుడు మాట మార్చకపోవడంతో వారు ఓటు వేయించారు. ఓటు వేసిన అరగంట తర్వాత మరణించాడు.
 

రాంచీ: ఆయనకు 105 ఏళ్లు. అంతిమ గడియల్లో ఉన్నాడు. చివరి కోరికగా ఆయన చెప్పిన మాట వింటే అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలని అనుకుంటున్నానని, అదే తన చివరి కోరిక అని ఆ వృద్ధుడు తెలిపాడు. ముందుగా కుటుంబ సభ్యులు ఇదేం చాదస్తం అని వారించే ప్రయత్నం చేశారు. కానీ, ఆ వృద్ధుడు అదే విషయాన్ని పదే పదే చెప్పడంతో వారు కన్విన్స్ అయ్యారు. వెంటనే ఓ కారు కిరాయికి తీసుకుని వారిని పోలింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఓటు వేసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు. ఓటు వేసిన అర గంట తర్వాత  ఆ వృద్ధుడు ప్రాణాలు ఒదిలాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

హజరిబాగ్ జిల్లా బెలాహి గ్రామానికి చెందిన వరణ్ సాహుకు 105 ఏళ్లు. ఆయనకు ఇద్దరు కుమారులు తరుణ్, కరణ్. శనివారం ఉదయం వరణ్ సాహు తన చివరి కోరికను కుమారులకు తెలియజేశాడు. జార్ఖండ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను ఓటు వేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. అదే తన చివరి కోరికగా వెల్లడించారు. కానీ, వరణ్ సాహు ఆరోగ్యం క్షీణ దశలో ఉన్నది. ఆయనను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం చాలా రిస్క్. అందుకే ఆయన కుమారులు ఇద్దరూ ఆయన చివరి కోరికను ముందుగా తిరస్కరించారు. అది సాధ్యపడదని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ, వరణ్ సాహు మాత్రం తన చివరి కోరిక విషయంలో వెనుకడుగు వేయలేదు. కచ్చితంగా తాను ఓటు వేయాల్సిందేనని గట్టిగా చెప్పాడు.

దీంతో వరణ్ సాహు చివరి కోరికపై ఇద్దరు కుమారులు ఆలోచించారు. వెంటనే ఓ ఎస్‌యూవీ కారును రప్పించారు. అందులో తండ్రిని కూర్చోబెట్టుకుని ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ బూత్‌ నెంబర్ 256కు తీసుకెళ్లారు. వెంటనే ఎన్నికల అధికారులు లాజిస్టిక్స్‌ను కారు వద్దకు తెచ్చారు. తరుణ్ తన తండ్రి ఓటర్ కార్డును చూపెట్టారు. అక్కడే వరణ్ సాహు తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటు వేసిన తర్వాత తన తండ్రి సంతోషపడ్డాడని తరుణ్ వెల్లడించాడు. ఆ తర్వాత ఆయనను ఇంటికి తీసుకువచ్చామని వివరించాడు. 2.30 గంటలకు ఇంటికి చేరుకున్నామని, ఆ తర్వత అరగంటకు అంటే సుమారు 3.00 గంటలకు తమ తండ్రి తుదిశ్వాస విడిచాడని చెప్పాడు.

తమ తండ్రి మరణంతో కుటుంబం బాధపడుతున్నదని, కానీ, ఆయన చివరి కోరిక తీర్చినందుకు సంతోషంగా కూడా ఉన్నదని కరణ్ అన్నాడు. ఆయన ఎంతో కాలంగా మంచానికే పరిమితం అయ్యాడని, కానీ, రాజకీయ వ్యవహారాలపై మాత్రం ఉత్సాహం తగ్గలేదని వివరించాడు. తన చివరి కోరికగా ఓటు వేయాలని సుమారు వారం రోజులుగా చెబుతున్నాడు.

జార్ఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.

click me!