ayodhya ram mandir : తండ్రి కోరిక .. బంగారుపూత పాదుకలతో తెలుగువాడి పాదయాత్ర , విలువెంతో తెలుసా..?

By Siva Kodati  |  First Published Jan 6, 2024, 4:57 PM IST

మన తెలుగు వాడైన చల్లా శ్రీనివాస్ శాస్త్రి అజ్ఞాతవాసం సమయంలో రాముడు కవర్ చేసిన అయోధ్య -  రామేశ్వరం మార్గంలో రివర్స్‌లో ప్రయాణిస్తున్నారు. శ్రీరాముడికి ఇవ్వడానికి పంచ ధాతు (ఐదు లోహాలు)తో తయారు చేసిన బంగారు పూత పూసిన పాదుకలు తీసుకెళ్తున్నానని శ్రీనివాస్ చెప్పారు. 


ఎన్నో వివాదాలు, సుదీర్ఘ నిరీక్షణ ఫలించి శ్రీరాముని జన్మభూమి అయోధ్యలో భవ్యమైన రామాలయం నిర్మితమైన సంగతి తెలిసిందే. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే వీరందరికీ ఆహ్వాన పత్రికలు అందాయి. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే భక్తులు సైతం శ్రీరాముడిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని ఎదురుచూస్తున్నారు.

వీరిలో మన తెలుగు వాడైన చల్లా శ్రీనివాస్ శాస్త్రి అజ్ఞాతవాసం సమయంలో రాముడు కవర్ చేసిన అయోధ్య -  రామేశ్వరం మార్గంలో రివర్స్‌లో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో శ్రీరామచంద్రుల వారు ప్రతిష్టించిన శివలింగాలన్నింటిని తాకుతూ మరో ప్రయాణాన్ని చేపట్టాలని అనుకున్నట్లు శాస్త్రి తెలిపారు. గతేడాది జూలై 20న తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. శాస్త్రి ఇప్పటికే ఒడిషాలోని పూరి, మహారాష్ట్రలోని త్రయంబక్, గుజరాత్‌లోని ద్వారక వంటి అనేక ప్రాంతాలను కవర్ చేశారు. 

Latest Videos

అయోధ్యకు చేరుకోగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేసే పాదరక్షలను తలపై పెట్టుకుని తాను 8000 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్తానని శ్రీనివాస్ శాస్త్రి వెల్లడించారు. వనవాస సమయంలో శ్రీరాముడు అనుసరించిన మార్గంపై దాదాపు 15 ఏళ్లు పరిశోధన చేసిన రిటైర్డ్ ఆదాయపు పన్ను శాఖ అధికారి డాక్టర్ రామావతర్ కనుగొన్న మ్యాప్‌ను తాను అనుసరిస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి అయోధ్యలో కరసేవలో పాల్గొన్నారు. ఆయన హనుమంతుడికి బలమైన భక్తుడని, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలన్నది ఆయన కోరికని.. తన తండ్రి మరణించినందున, ఆయన కలను తీర్చాలని నిర్ణయించుకున్నానని శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిరానికి తన వంతుగా ఇప్పటి వరకు 5 వెండి ఇటుకలను విరాళంగా ఇచ్చానని పేర్కొన్నారు. 

తాను ప్రస్తుతం శ్రీరాముడికి ఇవ్వడానికి పంచ ధాతు (ఐదు లోహాలు)తో తయారు చేసిన బంగారు పూత పూసిన పాదుకలు తీసుకెళ్తున్నానని శ్రీనివాస్ చెప్పారు. ఆయన మరో రెండు వారాల్లోపు గమ్యాన్ని చేరుకోబోతున్నాడు. మధ్య మధ్యలో యూకేకి వెళ్లాల్సి వున్నందున కొంతకాలం పాటు ఆయన తన పాదయాత్రను విరమించుకోవాల్సి వచ్చింది. అలా తమిళనాడులో ఆపివేసిన చోటి నుంచి శ్రీనివాస్ తన నడకను కొనసాగించారు. మరో ఐదుగురితో కలిసి ప్రస్తుతం యూపీలోని చిత్రకూట్‌లో వున్నానని.. అయోధ్యకు 272 కిలోమీటర్ల దూరంలో వున్నానని శాస్త్రి వెల్లడించారు. 10 రోజుల్లో గమ్యస్థానానికి చేరుకుంటానని ఆకాంక్షించారు. 

రోజుకు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్న శాస్త్రి.. తాను తీసుకెళ్తున్న పాదరక్షల విలువ రూ.65 లక్షలు వుంటుందని, ఇందులో కొంతమంది విరాళాలు కూడా వున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని అయోధ్య భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన శ్రీనివాస్ శాస్త్రి.. అయోధ్యలో శాశ్వతంగా స్థిరపడాలనే ఆలోచనలో భాగంగా అక్కడే ఇల్లు కట్టుకోవాలని భావిస్తున్నాడు. శాస్త్రి కుమారుల్లో ఒకరైన చల్లా పవన్ కుమార్ భారతదేశంలోనే మొదటి బ్లేడ్ రన్నర్ ఆయన అనేక పతకాలు సాధించారు. తాను గతంలో పలు స్టూడియోల్లో సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశానని శ్రీనివాస్ చెప్పారు. 

click me!