
Bihar Assembly Elections 2025 : కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో బీహార్‌లో 60కి పైగా కుల ఘర్షణలు జరిగాయని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. 30 వేలకు పైగా కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని… వ్యాపారులు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఆడపిల్లలు ఎవ్వరిని వదల్లేదని అన్నారు. ప్రభుత్వం నేరగాళ్ల ముందు తలవంచి మధ్యవర్తిత్వం గురించి మాట్లాడేది... ఈ మహాకూటమికి నేరగాళ్లపై చర్యలు తీసుకునే ధైర్యం లేదని యోగి విమర్శించారు.
ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లో మాఫియా ఆస్తులపై బుల్డోజర్ నడుస్తుంటే వాళ్ల బాస్‌లు కూడా భయపడిపోతున్నారని సీఎం యోగి అన్నారు. కానీ కాంగ్రెస్, ఆర్జేడీలు మాఫియా, అల్లరిమూకలు, అవినీతిపరులను కౌగిలించుకుంటాయన్నారు. వాళ్ల సానుభూతి పేదలపై కాదు, నేరగాళ్లపైనే అని యోగి ఎద్దేవా చేశారు.
సీఎం యోగి లౌరియాలో బీజేపీ అభ్యర్థి, భోజ్‌పురి నటుడు వినయ్ బిహారీకి మద్దతుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ క్రమంలో బుల్డోజర్ బాబా జిందాబాద్, జై శ్రీరామ్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. సభా స్థలంలో యువకులు బుల్డోజర్ బాబా ప్లకార్డులు ధరించి సీఎం యోగికి స్వాగతం పలికారు.
ఆర్జేడీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి వాళ్ల భూములను లాక్కున్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కిడ్నాప్‌లు ఒక పరిశ్రమగా మారాయి… కానీ ఒక్క కొత్త పరిశ్రమలు రాలేదన్నారు. నితీశ్ కుమార్ నాయకత్వంలో కిడ్నాప్ పరిశ్రమ మూతపడి, అభివృద్ధికి దారులు తెరుచుకున్నాయన్నారు. నేటి బీహార్ కొత్తది - సుసంపన్నం, స్వావలంబన కలిగిందని పేర్కొన్నారు. బీహార్ ముందుకు సాగితే, భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించి శాంతియుత బీహార్ కలను సాకారం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2005కు ముందు జంగిల్ రాజ్‌ను చూశారని… లాంతరు కాలంలో అంతా చీకటే ఉండేదని నేటి తరానికి చెప్పాలని సీఎం యోగి అన్నారు. ఇప్పుడు బీహార్ ప్రధాని మోదీ, నితీశ్ కుమార్ నాయకత్వంలో ఎల్ఈడీ వెలుగులతో ప్రకాశిస్తోందన్నారు. 20 ఏళ్లలో ఆర్జేడీ-కాంగ్రెస్ అవినీతి, అరాచకాల గుంతలను ఎన్డీఏ పూడ్చిందని అన్నారు. మోదీ ప్రభుత్వం 10 కోట్ల మంది పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, 4 కోట్ల ఇళ్లకు విద్యుత్, 3 కోట్ల ఇళ్లు, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చిందని ఆయన చెప్పారు.
భోజ్‌పురి ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఆ భూమిని సారవంతం చేశారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీహార్ భూమి మైథిలి, భోజ్‌పురి సంస్కృతులకు వారసత్వమన్నారు. శారదా సిన్హా గురించి ప్రస్తావిస్తూ, ఆమెకు పద్మ పురస్కారం కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పారు. యూపీలో తాను భోజ్‌పురి కళాకారులు రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్‌లను ఎంపీలుగా చేశానని, ఎందుకంటే కళాకారులు సమాజానికి ప్రేరణ అని సీఎం తెలిపారు. లౌరియా నుంచి కూడా ఎన్డీఏ భోజ్‌పురి కళాకారుడినే అభ్యర్థిగా నిలబెట్టింది.
తొలి దశలో బీహార్ తల్లులు, రైతులు, యువత రికార్డు స్థాయిలో ఓటింగ్ చేశారని సీఎం యోగి అన్నారు. 65 శాతం పోలింగ్ జరగడం నవంబర్ 14న ఈవీఎంలు తెరిచినప్పుడు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని సూచిస్తోంది.