జైలర్ సినిమా నటుడు స్టేషన్ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఆయన విడుదలను కేరళ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. సీఎం నివాసం నుంచి వచ్చిన ఆదేశాల వల్లే ఆయనను పోలీసులు విడుదల చేశారని ఆరోపించింది. దీనిపై పోలీసులు స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే ?
మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ లో హంగామా సృష్టించిన కేసులో అరెస్టయిన ‘జైలర్’ సినిమా నటుడు వినాయకన్ కు బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. అయితే దీనిని కాంగ్రెస్ తప్పుబట్టింది. వినాయకన్ పై కేరళ పోలీసులు ఐపీసీలోని బెయిలబుల్ సెక్షన్లను మాత్రమే విధించడం సరికాదని తెలిపింది.
నటుడిపై పోలీసులు బలహీనమైన సెక్షన్లు పెట్టారని, అతడి దుష్ప్రవర్తనతో అధికారుల విధులకు ఆటంకం కలిగించినప్పటికీ.. స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారని కాంగ్రెస్ నాయకురాలు, త్రిక్కక్కర ఎమ్మెల్యే ఉమా థామస్ ఫేస్ బుక్ లో ఆరోపించారు. ఆయన ఆకస్మికంగా విడుదల కామ్రేడ్ గా ఉండటం వల్లేనా (కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ..) అని ప్రశ్నించారు. క్లిఫ్ హౌస్ (కేరళ సీఉం పినరయి విజయన్ అధికారిక నివాసం) సూచనల మేరకే ఆ నటుడిని విడుదల చేశారా అని థామస్ ఆరోపించారు. హుందాగా పనిచేసే పోలీసు అధికారుల మనోస్థైర్యాన్ని ఈ చర్య దెబ్బతీస్తుందని ఆమె అన్నారు.
అయితే కొచ్చి డీసీపీ శశిధరన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పోలీసులు ఎలాంటి ప్రలోభానికి లొంగరని, వినాయకన్ కు మూడు సంవత్సరాల వరకు శిక్ష పడే సెక్షన్లను విధించారని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఎలాంటి ప్రలోభాలకు లొంగబోరని, వీడియో ఫుటేజీలను పరిశీలించి అవసరమైతే సంబంధిత సెక్షన్లు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరిపైనైనా క్రిమినల్ కేసులు ఉంటేనే నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉంటుందని డీసీపీ తెలిపారు.
కాగా.. మంగళవారం నాడు మద్యం మత్తులో ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లిన వినాయకన్ అక్కడి అధికారిపై దాడి చేసి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి, వైద్య పరీక్షల నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తరువాత బెయిల్ పై వినాయకన్ విడుదల అయ్యారు. ఇదిలావుండగా.. వైద్య పరీక్షల అనంతరం హాస్పిటల్ నుంచి పోలీసులతో బయలుదేరిన వినాయకన్ మీడియాతో మాట్లాడారు. తనను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తనకు తెలియదని చెప్పారు.