ఎస్పీతో మాయావతి తెగదెంపులు.. తప్పడం లేదన్న అధినేత్రి

By Siva KodatiFirst Published Jun 4, 2019, 12:27 PM IST
Highlights

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఎస్పీ-బీఎస్పీపై ఓటమి ప్రభావం గట్టిగా పడింది. ఈ క్రమంలో కూటమి బీటలు వాలుతుందని కథనాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మహాకూటమికి బీఎస్పీ అధినేత్రి మాయావతి అధికారికంగా గుడ్‌భై చెప్పారు

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఎస్పీ-బీఎస్పీపై ఓటమి ప్రభావం గట్టిగా పడింది. ఈ క్రమంలో కూటమి బీటలు వాలుతుందని కథనాలు వచ్చాయి.

వాటిని నిజం చేస్తూ మహాకూటమికి బీఎస్పీ అధినేత్రి మాయావతి అధికారికంగా గుడ్‌భై చెప్పారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె.. రానున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.

సమాజ్‌వాదీ పార్టీ తమ సొంత ఓటు బ్యాంకును కూడా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దక్కించుకోలేకపోయిందని మాయావతి ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజిక వర్గం ఓట్లు తమ పార్టీకి బదిలీ కాలేదని తెలిపారు.

ఈ పరిస్థితులు ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని, సోమవారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ఇది శాశ్వతంగా విడిపోవటం కాదని.. అఖిలేశ్ యాదవ్‌తో రాజకీయాలకు అతీతంగా సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని వెల్లడించారు. అఖిలేశ్, డింపుల్‌ తనకు ఎంతో గౌరవం ఇచ్చారని.. వారిని తన కుటుంబసభ్యులుగానే తాను భావించానని మాయావతి పేర్కొన్నారు. 

click me!