
ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్‌తో ప్రధాని మోదీ సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత విస్తరించే అంశాలపై చర్చించారు. ఆర్థిక సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ రంగంలో భాగస్వామ్యం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం అందిపుచ్చుకునే అవకాశాలపై నేతలు దృష్టి సారించారు. ఆఫ్రికన్ యూనియన్ ప్రాధాన్యం ఆఫ్రికా దేశాల అభివృద్ధి, గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకను అంతర్జాతీయంగా మరింత బలంగా వినిపించాల్సిన అవసరంపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు అనుగుణంగా సహకారాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి.
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జరిగిన సమావేశంలో భారత్-మలేషియా సంబంధాల్లో కొత్త అవకాశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా సెమీకండక్టర్ రంగం, కీలక ఖనిజాలు, స్వచ్ఛమైన ఇంధన వనరులు వంటి భవిష్యత్ అవసరాలకు సంబంధించిన రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం కల్పించే దిశగా చర్యలు తీసుకోవడంపై నేతలు చర్చించారు. సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థలో భారత్, మలేషియా కలిసి పనిచేస్తే ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్‌తో హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. భారత్-యూఏఈ మధ్య ఇప్పటికే ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. పెట్టుబడులు, ఇంధన భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్య మార్గాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో వియత్నాం ప్రధాని లే మిన్ హంగ్‌తో జరిగిన భేటీలో భారత్ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో వియత్నాం ప్రాధాన్యాన్ని మోదీ ప్రస్తావించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సముద్ర భద్రతతో పాటు ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో జరిగిన సమావేశంలో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించడంతో పాటు శాంతి, స్థిరత్వానికి అనుకూలమైన వాతావరణం అవసరం అని ఇరువురు నేతలు చర్చించారు. భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ పురోగతిపైనా చర్చ జరిగింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత నౌకాయానం కొనసాగడం, సముద్ర వాణిజ్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటం అత్యంత ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాతో భారత్ అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో ఇరాన్‌తో సహకారం కీలకంగా మారనుంది.
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరగనున్న సమావేశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. భారత్-చైనా సంబంధాల్లో సరిహద్దు అంశం అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగించేందుకు ఇరు దేశాల మధ్య జరిగిన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం, సైనిక స్థాయిలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనడం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. అలాగే నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, ప్రజల రాకపోకలు, దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత మెరుగుపరచడం వంటి అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ భేటీ భారత్-చైనా సంబంధాల్లో తదుపరి దశకు మార్గం చూపుతుందా అనే అంశంపై అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.