
Air India Plane Crash : జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 171 విమానం కుప్పకూలి భారీ ప్రాణనష్టం జరిగింది. విమానంలోని ప్రయాణికులే కాదు ఓ మెడికల్ కాలేజీ విద్యార్థులు, సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే తాజాగా ఈ విమాన ప్రమాదానికి సంబందించిన దర్యాప్తు వివరాలను AAIB (ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) బైటపెట్టింది. ఈ సంస్థ రిపోర్ట్ ప్రకారం… బోయింగ్ 787-8 విమానంలోని ఫ్యూయల్ కట్ఆఫ్ స్విచ్ ఆగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే రెండు ఇంజన్ల ఫ్యూయల్ కట్ఆఫ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. దీంతో ఇంజిన్లకి ఫ్యూయల్ సప్లై ఆగిపోయి విమానం పైకి ఎగరకుండా కిందకు వచ్చి జనవావాసాల్లో కుప్పకూలింది. పైలట్లు స్విచ్‌ని ఆన్ చేసి ఇంజన్లని మళ్ళీ స్టార్ట్ చేయడానికి, విమానాన్ని పైకి లేపడానికి ప్రయత్నించినా ప్రమాదం జరిగిపోయింది.
AAIB రిపోర్ట్ వచ్చాక డిసెంబర్ 2018లో అమెరికా FAA (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) విడుదల చేసిన SAIB (స్పెషల్ ఎయిర్‌వర్తినెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్) చర్చనీయాంశం అయ్యింది. బోయింగ్ విమానాల్లోని ఫ్యూయల్ కట్ఆఫ్ స్విచ్‌లలో సమస్య ఉందని, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని అందులో హెచ్చరించారు. 2018లో వచ్చిన ఈ హెచ్చరికని ఎయిర్ ఇండియా పట్టించుకుని ఉంటే జూన్ 12, 2025 నాటి ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో.
కొన్ని బోయింగ్ విమానాల్లో (క్రాష్ అయిన బోయింగ్ 787-8 కూడా వీటిలో ఒకటి) ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లకి లాకింగ్ ఫీచర్ లేకుండా అమర్చారని SAIB లో తెలిపారు. ఇది కేవలం సలహా కాబట్టి దీన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించలేదు. అందుకే ఉత్పత్తుల్లోని ప్రమాదకరమైన లోపాలను సరిచేయడానికి చట్టబద్ధంగా అమలు చేయాల్సిన ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్‌ని జారీ చేయలేదు.
1- ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌కి లాకింగ్ ఫీచర్ ఉందో లేదో చెక్ చేయండి. విమానం నేలపై ఉన్నప్పుడు, స్విచ్‌ని పైకి ఎత్తకుండానే రన్, కట్ఆఫ్ పొజిషన్ల మధ్య తిప్పగలుగుతున్నారా అని చూడండి. అలా తిప్పగలిగితే లాకింగ్ ఫీచర్ పనిచేయడం లేదని అర్థం. వెంటనే స్విచ్‌ని మార్చాలి. స్విచ్ రన్ పొజిషన్‌లో ఉంటే ఇంజిన్‌కి ఫ్యూయల్ వస్తుంది. కట్ఆఫ్ పొజిషన్‌లో ఉంటే ఫ్యూయల్ రాదు.
2- బోయింగ్ 737-700, -700C, -800, -900ER సిరీస్ విమానాల్లో, బోయింగ్ 737-8, -9 విమానాల్లో P/N 766AT613-3D ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఉంటే, దాన్ని P/N 766AT614-3D స్విచ్‌తో మార్చాలి. దీనికి మెరుగైన లాకింగ్ ఫీచర్ ఉంటుంది.