న్యూడ్ ఫోటో షూట్ కేసులో పోలీసు స్టేషన్‌కు రణ్‌వీర్ సింగ్.. దర్యాప్తులో ఏం చెప్పాడంటే?

By Mahesh KFirst Published Aug 30, 2022, 2:55 PM IST
Highlights

రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ పై మహారాష్ట్రలోని చెంబూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు నిన్న రణ్‌వీర్ సింగ్ హాజరయ్యారు. ఈ దర్యాప్తులో ఆయన మౌనమే పాటించినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. న్యూడ్ ఫొటో షూట్ ఎఫెక్ట్ ఇలా ఉంటుందని తాను ఊహించలేదని చెప్పినట్టు వివరించాయి.

ముంబయి: బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ కేసులో నిన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ముంబయిలోని చెంబూర్ పోలీసు స్టేషన్‌కు ఆయన ఉదయం 7 గంటలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు రిటర్న్ అయ్యారు. మళ్లీ అవసరం పడితే దర్యాప్తు అధికారులు సమన్లు పంపుతారని, అప్పుడు మళ్లీ హాజరు కావాల్సి ఉంటుందని ఆయనకు పోలీసులు తెలిపారు. ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటో షూట్‌లో పాల్గొన్న రణ్‌వీర్ సింగ్‌పై ఆ తర్వాత కుప్పలు తెప్పలుగా కామెంట్లు వచ్చాయి. ఆ ఫోటో షూటే వివాదాస్పదం అయింది. చాలా మంది ఆయనను ప్రశ్నించారు. కానీ, ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ వ్యాఖ్యలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులకు ఏం సమాధానం చెప్పి ఉంటారనే ఆసక్తి పెరిగింది.

జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు రణ్‌వీర్ సింగ్ విచారణపై కొన్ని వర్గాలు కీలక విషయాలు తెలిపాయి. ఈ న్యూడ్ ఫోటో షూట్ వివాదం తర్వాత మీడియాకు ఎలాంటి ప్రకటనలు చేయరాదని రణ్‌వీర్ సింగ్‌కు ఆయన లీగల్ టీమ్ కచ్చితమైన సూచనలు చేసిందని ఆ వర్గాలు వివరించాయి. ఆ న్యూడ్ ఫొటో షూట్ పై ఆయనకు కుప్పలు తెప్పలుగా ఫోన్ కాల్స్, మెస్సేజీలు వచ్చాయని, కానీ, వాటి పట్ల ఆయన మౌనంగానే ఉన్నాడని తెలిపాయి.

ఎలాంటి సమాధానం అయినా నేరుగా పోలీసులకే ఇవ్వాలని, మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదని ఆయన న్యాయవాది.. రణ్‌వీర్ సింగ్‌కు సూచనలు చేసినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పోలీసు స్టేషన్‌లోనూ ఇంటరాగేషన్ ఆసాంతం రణ్‌వీర్ సింగ్ మౌనంగానే ఉన్నాడని వివరించాయి. తాను ఆ ఫొటోలు అప్‌లోడ్ చేయలేదని, ప్రచురించలేదని పేర్కొన్నట్టు చెప్పాయి. అంతేకాదు, ఈ ఫోటోలకు ఫలితంగా అలా ఉంటుందని తనకు ముందుగా తెలియదని పేర్కొన్నాయి. టీమ్ నుంచి వచ్చిన క్రియేటివ్ గైడెన్స్‌కు అనుగుణంగా మాత్రమే ఒక యాక్టర్‌గా తాను ఫోటో షూట్‌లో పాల్గొన్నట్టు రణ్‌వీర్ సింగ్ వివరణ ఇచ్చినట్టు అవి వివరించాయి. అయితే, రణ్‌వీర్ సింగ్‌కు మరోసారి సమన్లు పంపుతారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదని తెలిపాయి.

మహిళల ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని అగౌరవపరిచారని, భావోద్వేగాలను గాయపరిచారని ఓ వ్యక్తి రణ్‌వీర్ సింగ్ పై న్యూడ్ ఫోటో షూట్‌ నేపథ్యంలో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని సెక్షన్లు 292, 294, ఐటీ యాక్ట్‌లోని 509, 67(ఏ) సెక్షన్‌ల కింద చెంబూర్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

click me!