
న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని మోతీ బాగ్ వద్ద దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఓ టూ వీలర్ మీద వస్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో 36 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని కిరాణా దుకాణం నడుపుతున్న అజయ్ గుప్తాగా గుర్తించారు. అతడు ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కారు అతనిపైకి దూసుకెళ్లినట్లు వారు తెలిపారు.
ప్రమాద సమయంలో కారును 28 ఏళ్ల యువతి నడుపుతోంది. ఆమె అశోక్ విహార్ నివాసి, వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్.. కారును అతివేగంగా నడుపుతూ మొదట జనరేటర్‌ను ఢీకొట్టింది. ఆ తరువాత అదే వేగంతో గుప్తా మీదికి కారు తోలినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళ గ్రేటర్ కైలాష్‌లోని ఓ పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
ఆప్ మేనిఫెస్టోతోనే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు.. : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ప్రమాదానికి సంబంధించి తెల్లవారుజామున 4.08 గంటలకు పోలీసులకు పీసీఆర్ కాల్ వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకోగా, మోతీ నగర్ ఫ్లైఓవర్ వైపు వెళ్లే రహదారిపై రెండు వాహనాలు దెబ్బతిన్న స్థితిలో కనిపించాయి. ఘటనా స్థలంలో వాహనం డ్రైవర్ కానీ, బాధితుడు కానీ కనిపించలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు.
ప్రమాదానికి గురైన వాహనం డ్రైవర్.. గాయపడిన గుప్తాను ఏబీజీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి బంధువులు అతడిని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడు వాంగ్మూలం ఇచ్చే పరిస్తితిలో లేడని గుర్తించారు. ఆ తర్వాత అతను గాయాలతో మరణించాడని బన్సాల్ తెలిపారు.
"మహిళ పార్టీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా బాధితుడ ఆసుపత్రి నుండి మందులు తీసుకొని ఇంటికి వెళుతున్నట్లు విచారణలో తేలింది" అని అధికారి తెలిపారు. బసాయి దారాపూర్‌లో నివసిస్తున్న గుప్తాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుప్తా తనకు మందులు తెచ్చుకునేందుకు అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 279 (బహిరంగ మార్గంలో ర్యాష్ డ్రైవింగ్ లేదా రైడింగ్), 337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య ద్వారా గాయపరచడం) సెక్షన్ 304 A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) ల కింద కేసు నమోదు చేశారు. గుప్తా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.