
Delhi CM Arvind Kejriwal: ఉచిత విద్యుత్, ఉచిత రేషన్ లతో కూడిన ఆప్ మేనిఫెస్టోతోనే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇటీవల ముగిసిన యూపీ స్థానిక ఎన్నికలలో విజయం సాధించిన ఆప్ నాయకులను ఉద్దేశించి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ మేనిఫెస్టోను అనుసరించడంతోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోను ప్రశంసించిన కేజ్రీవాల్.. కాంగ్రెస్ తమ పార్టీ నుండి ప్రేరణ పొందిందనీ, ఉచిత విద్యుత్, ఉచిత రేషన్, నిరుద్యోగ భృతి వంటి హామీలను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిందని అన్నారు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడంలో ఆప్ విజయవంతమైందనీ, ఇతర పార్టీలు కూడా ఓట్ల కోసం విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారించాయని ఆయన పేర్కొన్నారు.
అన్ని కుటుంబాలకు (గృహజ్యోతి) 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబ మహిళా పెద్దకు (గృహ లక్ష్మి) నెలకు రూ.2,000 సాయం, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబంలోని ప్రతి సభ్యుడికి (అన్న భాగ్య) 10 కిలోల బియ్యం, నిరుద్యోగ గ్రాడ్యుయేట్ యువతకు నెలకు రూ.3,000, నిరుద్యోగ గ్రాడ్యుయేట్ యువతకు రూ.1,500 ఉచిత ప్రయాణం (18-25 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు రూ.1,500 ఉచితం) కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం శనివారం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఎన్నికల హామీలను ఆమోదించింది.
దేశ రాజకీయాల రూపురేఖలను మార్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నించింది. కర్ణాటక ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోతో గెలిచింది : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
తాము ఉచిత విద్యుత్ ఇస్తామనీ, నిరుద్యోగ భృతి, ఉచిత రేషన్, మహిళలకు నెలకు రూ.1,000 ఇస్తామని తమ మేనిఫెస్టోలో చెప్పామనీ, కాంగ్రెస్ దీనిని అనుసరించిందని కేజ్రీవాల్ అన్నారు. గతంలో రాజకీయ పార్టీలు కులం, మతం ఆధారంగా ఓట్లు అడిగేవనీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా అలాంటి హామీలే ఇస్తోందని ఆరోపించారు.
'మీరు కష్టపడి పనిచేశారు.. బీజేపీని ఓడించారు'
మే 4, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన ఉత్తరప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆప్ మూడు నగర పాలిక చైర్ పర్సన్ స్థానాలు, ఆరు నగర పంచాయతీ చైర్ పర్సన్ స్థానాలు, ఆరు నగర నిగమ్ కౌన్సిలర్ స్థానాలతో పాటు పలు వార్డులను గెలుచుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న ఎన్నికల ఫలితాల ప్రకారం ఆప్ గెలిచిన అభ్యర్థుల్లో సగానికి పైగా మైనారిటీ వర్గానికి చెందినవారే. ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తర ప్రదేశ్ యూనిట్ నాయకులను అభినందించిన కేజ్రీవాల్, రాష్ట్రం బీజేపీ కంచుకోటగా పరిగణించబడుతున్నందున ఇది కష్టమైన ఎన్నికలని పేర్కొంటూ.. ఆప్ శ్రేణులు కష్టపడి బీజేపీ, ఎస్పీ, ఇతర పార్టీలను ఓడించాయని కొనియాడారు.