కరోనా బాధితులకు గుడ్ న్యూస్: దిగిరానున్న మందులు, టెస్టింగ్ కిట్ల ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Jul 13, 2021, 8:41 PM IST
Highlights

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా వున్న సమయంలో బ్లాక్ ఫంగస్‌తో పాటు ఇతర ముఖ్యమైన మెడిసిన్స్ కొరత ఎదురైంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్ధాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తాత్కాలికంగా తగ్గించింది కేంద్రం

కోవిడ్ కిట్లతో పాటు మందులపై ధరలు దిగిరానున్నాయి. కరోనా బాధితుల చికిత్సలో ఉపయోగించే కొన్ని రకాల ఔషధాల తయారీలో ఉపయోగించే ముడిపదార్ధాల దిగుమతిపై కేంద్రం ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు టెస్ట్ కిట్ల రా మెటీరియల్స్ దిగుమతికి కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతో బ్లాక్ ఫంగస్‌ చికిత్సలో వాడే మందులతో పాటు కరోనా కిట్ల ధరలు మరికొన్ని రోజుల పాటు తగ్గే అవకాశం వుంది. ఏపీఐలపై ఆగస్టు 31 వరకు, టెస్ట్ కిట్ ముడిపదార్ధాలపై సెప్టెంబర్ 31 వరకు ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతంగా వున్న సమయంలో బ్లాక్ ఫంగస్‌తో పాటు ఇతర ముఖ్యమైన మెడిసిన్స్ కొరత ఎదురైంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్ధాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తాత్కాలికంగా తగ్గించింది కేంద్రం. ఇందుకోసం డీఎంపీసీ, డీఎంపీజీ, హెచ్ఎస్‌పీసీ, డీఎస్‌పీజీ, ఎగ్లిసైథిన్, కోలెస్ట్రాల్ హెచ్‌పీతో పాటు కోవిడ్ కిట్ల తయారీలో వాడే అమ్మోనియం వంటి ముడిపదార్ధాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించింది. కోవిడ్ కిట్లు, ఔషదాలు ప్రజలకు అందుబాటులో వుండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

Also Read:కేరళ: భారత తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లో చికిత్స

శానిటైజర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, టెస్టింగ్ కిట్లు, శరీర ఉష్ణోగ్రతను తెలుసుకునే పరికరాలతో పాటు 18 రకాల వస్తువుల రేట్లపై పన్నులను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన రెవెన్యూ విభాగం గత నెలలో ప్రకటించింది. ఆంఫోటెరిసిన్‌పై కూడా 5 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించగా, రెమ్‌డిసివర్, హెప్పోరిన్‌పై వున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. ఇక అంబులెన్స్‌లపై 28 శాతం జీఎస్టీ వుండగా.. వాటిని 12 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో వుంటాయని తెలిపింది. 

click me!