వేడెక్కిన హస్తిన: రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ..!

By team teluguFirst Published Jul 13, 2021, 4:45 PM IST
Highlights

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు, ఆయన రాహుల్ గాంధీని కలవడంతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. 

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇందాక కొద్దిసేపటి కింద రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆయన తన కారు దిగి రాహుల్ గాంధీని కలవడానికి లోపలి వెళ్తున్న విజువల్స్ బయటకు రావడంతో హస్తినలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. 

మమతా బెనర్జీ బెంగాల్ లో ఘన విజయం సాధించిన తరువాత... తాను ఇక వ్యూహకర్తగా వ్యవహరించబోనని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్... ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీతో భేటీ అవడం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ని కలిసిన రెండు రోజుల్లోనే రాహుల్ గాంధీతో భేటీ అవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 

వచ్చే సంవత్సరం ఆరంభంలో పంజాబ్ లో ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ తోపాటుగా అతి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్న వేళ... ప్రశాంత్ కిషోర్ ఇవాల రాహుల్ గాంధీతో భేటీ అవడం ఆసక్తిని రేపుతోంది. 

ఇప్పటికే దేశంలోని విపక్షాలు కేంద్రంలోని బీజేపీని గద్దె దించడానికి ఒక్కటవ్వాలని వరుస భేటీలు నిర్వహిస్తూ రాజకీయాలు సాగిస్తున్న వేళ... ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను ఇక ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించబోనని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వ్యూహకర్తగా వచ్చారా, లేదా విపక్షాల ఐక్యత కోసం అందరినీ ఒక్కతాటి పైకి తీసుకురావడానికి అన్ని పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నట్టే ఇప్పుడు రాహుల్ గాంధీతో కూడా చర్చలు జరపడానికి వచ్చారా అనేది మాత్రం తెలియరాలేదు. 

వారిరువురి మధ్య లోపల ఏమి చర్చలు జరిగాయనేది, ఇరు పక్షాల్లో ఎవరో ఒకరు బయటకొచ్చి చెబితేనే తెలుస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాల ఐక్యత కోసం శ్రమిస్తున్న ప్రాంతీయ పార్టీ నేతలైన మమతాబెనర్జీ,శరద్ పవార్ లు భేటీలు నిర్వహించారు. యశ్వంత్ సిన్హా ఆధ్వర్యంలో కూడా ఒక భేటీ జరిగిన విషయం విదితమే. 

దేశంలోని విపక్షాలన్నీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇందుకు ప్రశాంత్ కిషోర్ వారందరి మధ్య ఒక వారధిగా పనిచేస్తున్నదని వార్తలు కూడా వినబడుతూనే ఉన్నాయి. లేదా ప్రస్తుత పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో వాటిని చక్కదిద్దడం కోసం ఆయన సంధి కుదర్చడానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడానికి వచ్చాడా అనేది కూడా చర్చకు వస్తున్న మరో కారణం. 

ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐపాక్ సంస్థ పంజాబ్ లో అమరిందర్ సింగ్ కోసం పనిచేస్తుంది. గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ వెంటనే బయటకు వచ్చే కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులపై, నిర్ణయాత్మకత లేకపోవడం పై బహిరంగ విమర్శలు చేసిన విషయం అందరికి తెలిసిందే. చూడాలి ఇప్పుడు వీరిరువురి మధ్య ఈ భేటీ ఎందు కోసమో..!

click me!