
Navjot Singh Sidhu : ప్రధానమంత్రి మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం రాజకీయంగా తీవ్రదుమారం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనదైన స్టైల్ లో స్పందించారు. ప్రధానికి భద్రత లేదంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, పంజాబ్ పర్యటనను రద్దు చేసుకోవడంపై రాజకీయాలు చేయడం ఆపాలని నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం సిద్దూ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కావాలనే రాజకీయం చేస్తుందనీ, వాస్తవాలను పక్కన పెట్టి.. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. కావాలని పంజాబ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కావాలనే.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ.. భజన చేసే కొన్ని చిలుకలైతే పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై చాలా రాజకీయాలు చేశారు. ఇక ఆపండి. మీకు సరైన సమాధానం తొందరలోనే వస్తుంది’’ అని సిద్ధూ అన్నారు.
పంజాబ్ సర్కార్ ను అప్రతిష్టపాలు చేయడం కోసమే.. బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రధాని పాల్గొనాల్సిన సభలో ప్రజలెవ్వరూ లేరని, అందుకే ప్లాన్ మొత్తాన్ని మార్చేశారని, ప్రధాని బహిరంగ సభకు 7 వేల కుర్చీలు వేస్తే.. కేవలం 500 ల మంది మాత్రమే సభకు హాజరయ్యారనీ, ఆ సభలో పాల్గొంటే.. ప్రధాని తన పరువు పోతుందని భావించి.. ఈ చర్యకు పాల్పడినట్టు సిద్దు ఆరోపించారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉందని, కానీ, రోడ్డు మార్గంలో ఎందుకు ప్రయాణించారని ప్రశ్నించారు. అసలు రోడ్డు మార్గంలో ప్రయాణించాలన్న ఎందుకు నిర్ణయించుకున్నారు. ప్రధాని భద్రతా విషయంలో కేంద్ర నిఘా సంస్థల పాత్ర ఏం లేదా? వారి ఎందుకు
రక్షణ కల్పించపోయారు. ప్రధాని పాల్గొనాల్సిన సభలో ప్రజలెవ్వరూ లేరని, అందుకే ప్లాన్ మొత్తాన్ని మార్చేశారని, ఇదంతా ఓ డ్రామా అని, ఆ ప్రకారమే నడుచుకుంటున్నారని సిద్దూ ఆరోపించారు.
మోడీ కేవలం బీజేపీ ప్రధాని మాత్రమే కాదని, దేశం మొత్తానికి ఆయన ప్రధాన మంత్రి అని సిద్దూ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ప్రాణాలకు ముప్పు ఉందంటూ.. పదేపదే వ్యాఖ్యలు చేయడం సరికాదనీ.. ఇలా చేయడం వలన పంజాబీలను కించపరచడమే అవుతుందన్నారు. అలాగే.. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారని, అవన్నీ బీజేపీ చిలుకలా? అంటూ నిలదీశాడు. ప్రధాని ప్రాణాలు ఎంత విలువైనవో చిన్న పిల్లలను అడిగినా చెబుతారని సిద్దూ స్పష్టం చేశారు.
మరోవైపు పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ భద్రతా లోపంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ప్రధాని భద్రత ఎస్పీజీ పరిధిలోకి వస్తుందని, రాష్ట్రం పరిధిలోకి రాదని వాదించారు.. ప్రధానికి భద్రత కల్పించకపోవడం అనేది అరుదైన అంశమని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను దిగజార్చిందని అన్నారు. అయితే ప్రధాని పంజాబ్ పర్యటనకు సంబంధించిన ట్రావెల్ రికార్డులను సేకరించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీం ఆదేశించింది.