బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు.. అప్పటి వరకు సారథి ఆయనే

By Siva Kodati  |  First Published Feb 18, 2024, 6:20 PM IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. ఈ ఏడాది జూన్ వరకు ఆయనే పార్టీ అధినేతగా వ్యవహరించనున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదంతో వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని నడ్డాకు అప్పగించినట్లు బీజేపీ వెల్లడించింది. 


బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. ఈ ఏడాది జూన్ వరకు ఆయనే పార్టీ అధినేతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదంతో వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని నడ్డాకు అప్పగించినట్లు బీజేపీ వెల్లడించింది. కొద్దిరోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. నడ్డా నాయకత్వంలో బీజేపీ పలు రాష్ట్రాల్లో విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అమిత్ షా చెప్పినట్లుగానే నడ్డా పదవీకాలాన్ని మరికొంతకాలం పొడిగిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. 

ఇకపోతే.. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలతో పాటు వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని.. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు దగ్గరకు చేరుకోవాలి మోడీ కోరారు. నవభారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని.. వచ్చే 100 రోజులు ఎంతో కీలకమని ప్రధాని వ్యాఖ్యానించారు. 

Latest Videos

సబ్‌ కా సాత్, సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యమని.. బీజేపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని మోడీ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తామని.. విపక్ష నేతలు కూడా ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని చెబుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో అవినీతిరహిత పాలన అందించామని.. ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ వ్యవస్థలు అలాగే వుంటాయి.. కానీ వ్యవస్థల్ని కూడా ప్రక్షాళన చేశామని మోడీ గుర్తుచేశారు. 

తనకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు. గత పదేళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయని.. ప్రతిపక్షాలవి అబద్ధపు వాగ్ధానాలని, తాము ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పమని ఆయన వెల్లడించారు. తాము తప్ప వికాస్ భారత్ కోసం ఎవ్వరూ హామీ ఇవ్వలేదని.. వికసిత్ భారత్‌కు మోడీయే గ్యారంటీ అని ప్రధాని తెలిపారు. అయోధ్యలో రామమందిరం పూర్తి చేసి ఐదు శతాబ్ధాల కల నెరవేర్చామని, ఏడాదిన్నరగా నిశ్శబ్ధంగా పనిచేసుకుంటూ వెళ్తున్నామన్నారు. 

click me!