వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తామని.. విపక్ష నేతలు కూడా ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని చెబుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రధాని చెప్పారు.
18 ఏళ్లు నిండినవారంతా 18వ లోక్‌సభకి ఓటు వేయబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ నేషనల్ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగిస్తూ.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని.. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు దగ్గరకు చేరుకోవాలి మోడీ కోరారు. నవభారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని.. వచ్చే 100 రోజులు ఎంతో కీలకమని ప్రధాని వ్యాఖ్యానించారు.
సబ్ కా సాత్, సబ్ కా వికాసే బీజేపీ లక్ష్యమని.. బీజేపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని మోడీ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తామని.. విపక్ష నేతలు కూడా ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని చెబుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో అవినీతిరహిత పాలన అందించామని.. ఇంకా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ వ్యవస్థలు అలాగే వుంటాయి.. కానీ వ్యవస్థల్ని కూడా ప్రక్షాళన చేశామని మోడీ గుర్తుచేశారు.
తనకు రాజకీయాలు ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు. గత పదేళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయని.. ప్రతిపక్షాలవి అబద్ధపు వాగ్ధానాలని, తాము ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పమని ఆయన వెల్లడించారు. తాము తప్ప వికాస్ భారత్ కోసం ఎవ్వరూ హామీ ఇవ్వలేదని.. వికసిత్ భారత్‌కు మోడీయే గ్యారంటీ అని ప్రధాని తెలిపారు. అయోధ్యలో రామమందిరం పూర్తి చేసి ఐదు శతాబ్ధాల కల నెరవేర్చామని, ఏడాదిన్నరగా నిశ్శబ్ధంగా పనిచేసుకుంటూ వెళ్తున్నామన్నారు.
2029లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సిద్ధంగా వున్నామని ప్రధాని వివరించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఈశాన్య భారతాన్ని గత ప్రభుత్వాలు చీకట్లో వదిలేశాయని.. సియాచిన్‌లోని చివరి గ్రామం మాకు దేశంలో మొదటి గ్రామమని ఆయన తెలిపారు. తమ కేబినెట్‌లో రికార్డు స్థాయిలో ఈశాన్య ప్రాంత మంత్రులు వున్నారని మోడీ వెల్లడించారు. మోడీ ఏం చేయగలడని అనుకున్నారు, మోడీ ఏం చేశాడో అందరూ చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ఇంకా కొంత సమయం వుందని.. రాబోయే ఆగస్టు వరకు నా విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైందని మోడీ తెలిపారు. కాంగ్రెస్ అవినీతికి తల్లిలాంటిదని.. కాంగ్రెస్‌లోని ఒక వర్గం మోడీని విమర్శించడం, తిట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. రాబోయేది మోడీ ప్రభుత్వమని అనేక దేశాలు ఫిక్సయ్యాయని.. సైన్యాన్ని కూడా కాంగ్రెస్ అవమానించిందని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని.. దీని వల్ల కాంగ్రస్ కే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌ను అమ్ముతున్నట్లు ప్రచారం చేశారని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.