కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సెటైర్.. ‘దేశం కోసం సరిహద్దు గురించి అడుగొద్దా?’

By telugu teamFirst Published Dec 1, 2021, 8:28 PM IST
Highlights

బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కేంద్ర ప్రభుత్వంపై సెటైర్ వేశారు. చైనా బలగాలు దేశ సరిహద్దు ఎల్ఏసీ దాటాయా? అని తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంపై ఆయన ట్వీట్ చేశారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన ప్రశ్నను ఆమోదించడం లేదనే సమాధానం రావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇది హాస్యాస్పదం కాక ఇంకేమిటంటూ పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి(BJP MP Subramanian Swamy) సెటైర్ వేశారు. Rajya Sabhaలో తాను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చెప్పిన సాకును ఆయన హైలైట్ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. లడాఖ్‌లో Border (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్.. LAC)ను China బలగాలు దాటాయా? అని ఎంపీ సుబ్రమణ్య స్వామి రాజ్యసభలో తన ప్రశ్న వేశారు. కానీ, తన ప్రశ్నకు సమాధానం చెప్పడం కుదరని రాజ్యసభ సెక్రెటేరియట్ నుంచి సమాధానం వచ్చింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన ప్రశ్నను అనుమతించడం లేదని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు.

లడాఖ్‌లో చైనా బలగాలు ఎల్‌ఏసీని దాటి భారత భూభాగంలోకి వచ్చారా? అని తాను ప్రశ్న అడిగారని, అయితే, దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రశ్నను అనుమతించడం లేదని రాజ్యసభ సెక్రెటేరియట్ నుంచి బదులు వచ్చిందని ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేశారు. ఇది విషాదం కాదనుకుంటే హాస్యాస్పదమే అని పేర్కొన్నారు. కాగా, దీనిపై రాజ్యసభ సెక్రెటేరియట్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. సంబంధిత మంత్రిత్వ శాఖల ఆజ్ఞానుసారమే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు. సెన్సిటివ్ విషయాలపై వారి సూచనల్లోనే సమాధానం చెబుతామని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం నుంచి సాగుతున్న ఆనవాయితే ఇది అని వివరించారు.

Also Read: భారత్‌లో మరో చైనా గ్రామం?.. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 నివాసాలు!.. శాటిలైట్ చిత్రాల వివరాలివే

గాల్వన్ లోయలో భారత బలగాలకు, చైనా ఆర్మీ బలగాలకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగినప్పటి నుంచి ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉన్నది. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు చాలా మంది సరిహద్దు గొడవలపై కేంద్రంపై ప్రశ్నలు కురిపించారు. చైనా బలగాలు భారత సరిహద్దులోకి వచ్చాయని ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది.

రాజ్యసభలో ప్రతిపక్షాల ప్రశ్నలను సెక్రెటేరియట్ సంబంధిత మంత్రిత్వ శాఖకు బదిలీ చేస్తుంది. ఆ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాధానాలను సెక్రెటేరియట్ మరోసారి పరిశీలించి సమాధానాలు ఇస్తుంది. అయితే, ఒక ప్రశ్నను ఆమోదించాలా? తిరస్కరించాలా? అనేది పూర్తిగా రాజ్యసభ చైర్మన్‌ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. 

గత పార్లమెంటు సమావేశాల్లోనూ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం దాటవేసింది. పెగాసెస్ స్పైవేర్‌తో జర్నలిస్టులు, యాక్టివిస్టులు, రాజకీయ నేతల ఫోన్‌లను ట్యాప్ చేశారన్న కథనాలు ఆ సమావేశాలకు సరిగ్గా ఒక్క రోజు ముందు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అభివృద్ధి చేసింది. అయితే, ఆ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వ సంస్థలకు మాత్రమే తాము విక్రయిస్తామని ఎన్‌ఎస్‌వో చెప్పింది. ఈ నేపథ్యంలో భారత యాక్టివిస్టులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలపై ఈ స్పైవేర్ పెగాసెస్‌తో నిఘా పెట్టారన్న కథనాలు వెలువడటంతో ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించాయి. ఈ క్రమంలోనే గత సమావేశాల్లో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్నదా? అనే ప్రశ్నను ప్రతిపక్షాలు అడిగాయి. కానీ, ఆ ప్రశ్నను కేంద్ర ప్రభుత్వం దాటవేసింది. పెగాసెస్ విషయంపై సుప్రీంకోర్టు విచారిస్తున్నదని, ఈ తరుణంలో తాము స్పందించడం సరికాదని పేర్కొంటూ సమాధానం ఇవ్వలేదు.

click me!