రాహుల్, సోనియాలను దేశద్రోహం కింద విచారించాలి.. నా మాటకు కట్టుబడి ఉంటాను: కాంగ్రెస్‌కు రాజ్యవర్ధన్ కౌంటర్

By Sumanth KanukulaFirst Published Aug 12, 2023, 2:39 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దేశద్రోహం కింద విచారించాలని బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ రాథోడ్  మరోసారి డిమాండ్ చేశారు. 

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ రాథోడ్  సంచలన వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దేశద్రోహం కింద విచారించాలని మరోసారి డిమాండ్ చేశారు. తనపై ప్రివిలేజ్ ఉల్లంఘన చర్యలను ప్రారంభించాలని ఫ్లోర్ లీడర్‌లను అభ్యర్థిస్తూ కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ చేసిన ట్వీట్‌పై రాజ్యవర్ధన్ రాథోడ్ ఈ విధంగా స్పందించారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల రాజ్యవర్దన్ రాథోడ్ ఇటీవల  లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘‘నేను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో (చైనాలో) ఉన్నాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మమ్మల్ని కలవడానికి వస్తున్నారని మాకు తెలుసు. వారు మమ్మల్ని కలవడానికి రాలేదు. వారు కమ్యూనిస్ట్ పార్టీని కలిశారు. చైనా. వారిని దేశద్రోహం కింద విచారించాలి...’’ అని పేర్కొన్నారు. 

అయితే రాజ్యవర్దన్ రాథోడ్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సోనియా గాంధీ భారతీయ అథ్లెట్లను కలుసుకున్నారనే కథనానికి సంబంధించిన వార్త క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘ఒక మాజీ క్రీడా మంత్రిగా నేను రాజ్యవర్ధన్ రాథోడ్‌ని అడుగుతున్నాను.. ఇక్కడ పోస్టు చేసిన  వార్త నిజేమనా? అని నేను అడుగుతున్నాను. నిజమైతే, ఢిల్లీ శాసనసభ మాజీ స్పీకర్‌గా.. రాథోడ్‌పై ప్రత్యేక హక్కుల ఉల్లంఘన చర్యలను ప్రారంభించాలని మా ఫ్లోర్ లీడర్‌లను అభ్యర్థిస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే స్పందించిన రాజ్యవర్దన్ రాథోడ్.. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ డీల్ చేసుకుందని.. దానిని దేశం తెలుసుకోవాలని అనుకుంటుందని అన్నారు. చైనాలో ఒకే పార్టీ  ఉందని.. అప్పుడు భారత్‌లో అధికారంలో ఉన్న పార్టీ వారిని కలిసిందని అన్నారు. 2008లో చైనాలో కాంగ్రెస్ పార్టీ ఏ సంతకం చేసిందని ప్రశ్నించారు. 

‘‘నేను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో (చైనాలో) ఉన్నాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మమ్మల్ని కలవడానికి వస్తున్నారని మాకు తెలిసింది. వారు మమ్మల్ని కలవడానికి రాలేదు. వారు చైనా కమ్యూనిస్ట్ పార్టీని కలిశారు. ఇప్పుడు వారిని దేశద్రోహం కింద ఎందుకు విచారించకూడదు? దేశద్రోహం నేరం కింద వారిని ఖచ్చితంగా విచారించాలి. నేను నా మాటలపై నిలబడతాను’’ అని రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ అన్నారు. ఇక, సోనియాగాంధీ వాహనం రోడ్డుపై రెండు నిమిషాలు ఆగి తిరిగి వెళ్లిపోయిందని రాజ్యవర్దన్ రాథోడ్ చెప్పడం గమనార్హం.

click me!