సతీసహగమన దురాచారాన్ని బీజేపీ నేత గొప్పదిగా మాట్లాడారు: ప్రతిపక్షాల ఆరోపణ, లోక్‌సభలో నిరసనలు

By Mahesh KFirst Published Feb 7, 2023, 3:08 PM IST
Highlights

లోక్‌సభలో సతీసహగమనం దురాచారాన్ని బీజేపీ ఎంపీ పొగిడారని ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనలు చేశాయి. కాగా, రికార్డులు పరిశీలిస్తానని స్పీకర్ బిర్లా సభను వాయిదా వేశారు. బీజేపీ ఎంపీ సీపీ జోషి సతీని గొప్పగా వర్ణించాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
 

న్యూఢిల్లీ: సతీసహగమన దురాచారాన్ని ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవారు. ఆడవారు తప్పకుండా ఆచరించాలని ఒత్తిడి పెట్టేవాళ్లు. దాని చుట్టూ అల్లిన మూఢత్వాన్ని తృణీకరించి ఆ దురాచారాన్ని మొత్తంగానే సంఘసంస్కర్తలు రూపుమాపారు. తాజాగా, ఈ సాంఘిక దురాచారం ఇప్పుడు లోక్‌సభలో ప్రతిపక్షాల నిరసనలకు కారణమైంది. బీజేపీ ఎంపీ చంద్రప్రకాశ్ జోషి సతీ సహగమనాన్ని గొప్పగా చిత్రించాడని ప్రతిపక్షాలు నిరసనల బాటపట్టాయి. తీవ్ర ఆందోళనకు దిగాయి. దీంతో రికార్డులు చెక్ చేస్తామన్న స్పీకర్ ఓం బిర్లా సభను కొంతకాలం వాయిదా వేశారు. బీజేపీ ఎంపీ చంద్ర ప్రకాశ్ జోషి రాజస్తాన్‌లోని చిత్తోడ్‌గడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ఎంపీ చంద్ర ప్రకాశ్ జోషి ప్రారంభించారు. ఇందులోనే ఆయన మేవాడ్ రాణి పద్మావతి గురించి ప్రస్తావించారు. దురాక్రమణదారు అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి తన గౌరవాన్ని(మాన ప్రాణాలు!) కాపాడుకోవడానికి మంటకు స్వయంగా ఆహుతిచ్చుకున్నట్టు విశ్వసిస్తారు.

ఎన్సీపీ నేత సుప్రియా సూలే, డీఎంకే నేతలు కనిమొళి, దయానిది మారన్, ఏ రాజా, కాంగ్రెస్ ఎంపీ కే మురళీధరన్, ఏఐఎంఐఎం ఇంతియాజ్ అలీలు ఒంటికాలిపై లేచారు. సతీసహగమన దురాచారాన్ని ఎంపీ జోషి పొగిడారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనలు చేశారు. 

Also Read: లోక్‌ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ.. రాజ్య సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా..

కాగా, సతీసహగమన ఆచారాన్ని తాను ఉటంకించలేదని, కానీ, పద్మావతి జౌహర్ చేసుకుని తన గౌరవాన్ని కాపాడుకుందని మాత్రమే పేర్కొన్నానని ఎంపీ సీపీ జోషి తెలిపారు. ఇప్పటికీ తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వివరించారు.

మధ్యాహ్నం 1.06 గంటలకు దిగువ సభలో నిరసనలు ప్రారంభం అయ్యాయి. జోషి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను విమర్శిస్తూ ప్రతిపక్ష ఎంపీలు ట్రెజరీ బెంచ్‌ల వైపూ వెళ్లారు.  నినాదాలు చేస్తూ ఆందోళనల కు దిగారు. దీంతో సభ 1.30 గంటల వరకు వాయిదా పడింది. 

click me!