కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు నసీర్ హుస్సేన్ విజయం సాధించిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని బీజేపీ పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది.
కర్ణాటక : కాంగ్రెస్ కార్యకర్తలు 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేశారని బిజెపి ఆరోపించింది. దీనిమీద బెంగళూరు పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే, కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపారేసింది, బీజేపీ అబద్ధాలు చెబుతోందని ఆరోపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నాయకుడు నసీర్ హుస్సేన్ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకుంటూ అసెంబ్లీ లోపల కాంగ్రెస్ కార్యకర్తలు “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఈ వాదనలను తోసిపుచ్చింది, తమ కార్యకర్తలు హుస్సేన్ కోసం నినాదాలు మాత్రమే చేస్తున్నారని, బిజెపి ఆరోపణలు వాస్తవం కాదని పేర్కొంది.
కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను మంగళవారం కాంగ్రెస్ మూడింటిని గెలుచుకుంది. ఫలితాలు ప్రకటించిన కొద్దిసేపటికే, బిజెపి ఐటి సెల్ హెడ్ అమిత్ మాల్వియా "పాకిస్తాన్ జిందాబాద్" అని నినాదాలు చేస్తున్నారని చెబుతూ.. హుస్సేన్ గెలుపుతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న వీడియోను షేర్ చేశారు.
"కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజకీయ కార్యదర్శి, కాంగ్రెస్‌కు చెందిన నసీర్ హుస్సేన్ కర్ణాటక నుండి రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పాకిస్తాన్ జిందాబాద్ నినాదాల అంశం తెరమీదికి వచ్చింది. పాకిస్తాన్‌పై కాంగ్రెస్ మోజు ప్రమాదకరం. ఇది భారతదేశాన్ని బాల్కనైజేషన్ వైపు తీసుకెళుతోంది. మనందీన్ని సహించలేం’’ అని మాల్వియా ఒక పోస్ట్ లో అన్నారు.
జర్మన్ మహిళ పాటను ఆస్వాదిస్తూ.. దరువేసిన ప్రధాని మోడీ...
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కర్ణాటక నేత సీటీ రవి సహా పలువురు ఇతర బీజేపీ నేతలు కూడా ఇదే వాదనతో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బీజేపీ వాదనను తోసిపుచ్చిన కాంగ్రెస్ నాయకుడు నసీర్ హుస్సేన్, తాను 'నసీర్ హుస్సేన్ జిందాబాద్,' 'కాంగ్రెస్ పార్టీ జిందాబాద్,' 'నసీర్ ఖాన్ జిందాబాద్,' 'నసీర్ సాబ్ జిందాబాద్' లాంటి నినాదాలు మాత్రమే విన్నానని అన్నారు.
"మీడియాలో ఏం చూపించారో అవి నేను వినలేదు, నేను అది విని ఉంటే, అభ్యంతరం తెలిపేవాడిని, దీన్ని ఖండిస్తున్నానని, అలా ఎవరైనా చేస్తే వారిమీద అవసరమైన చర్యలు తీసుకోవాలని" చెప్పారు. భారతీయ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి, బిజెపి వాదనలను తోసిపుచ్చారు, పార్టీ కార్యకర్తలు వాస్తవానికి వీడియోలో “నసీర్ సాబ్ జిందాబాద్” అని చెబుతున్నారని అన్నారు.
బిజెపి అబద్ధాలు చెబుతోందని ఆరోపించిన శ్రీనివాస్ బివి, "నసీర్ సాబ్ జిందాబాద్"ని "పాకిస్తాన్ జిందాబాద్" అని తికమక పెట్టేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. మంగళవారం సాయంత్రం బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని కాగ్నిసాన్స్ గా తీసుకుని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశారు.