బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ప్రధాని మోదీని సత్కరించిన జేపీ నడ్డా..

By Sumanth KanukulaFirst Published Feb 7, 2023, 10:31 AM IST
Highlights

పార్లమెంట్ సమావేశాల కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. 

పార్లమెంట్ సమావేశాల కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభం కాగానే కేంద్ర బడ్జెట్‌ 2023కు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ప్రధాని మోదీని సత్కరించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇటీవల ఆమోదించిన కేంద్ర బడ్జెట్ 2023-24తో సహా పలు కీలకమైన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేసే విధంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తారని భావిస్తున్నారు. 

ఇక, ఈ ఏడాది జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంయుక్త ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే అదానీ‌ సమస్యపై కొనసాగుతున్న దుమారం కారణంగా పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగలేదు. అదానీ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్షాలు ఉభయ సభలలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేపడుతూనే ఉన్నాయి. 

అదానీ స్టాక్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా స్పందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అదానీ గ్రూప్‌పై వచ్చిన స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక, పార్లమెంట్ బడ్జెట్ సెషన్ మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుంది. రెండవ విడత మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనుంది. 

click me!