బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసు.. 11 మంది జీవిత ఖైదీలను విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వం..

By Bukka SumabalaFirst Published Aug 16, 2022, 10:15 AM IST
Highlights

2002లో గుజరాత్‌లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన కేసులో.. జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితులకు  గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం విడుదల చేసింది. 

గోద్రా : 2002 గోద్రా అనంతర బిల్కిస్ బానో ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో జీవిత ఖైదు పడిన మొత్తం పదకొండు మంది దోషులు సోమవారం గోద్రా సబ్-జైలు నుండి విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి అనుమతించిందని అధికారులు తెలిపారు. జనవరి 21, 2008న ముంబైలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కోర్టు, బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఆరోపణలపై పదకొండు మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. 

ఆ తర్వాత బాంబే హైకోర్టు వారి శిక్షను సమర్థించింది. ఈ దోషులు 15 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ప్యానెల్‌కు నేతృత్వం వహించిన పంచమహల్స్ కలెక్టర్ సుజల్ మయాత్ర తెలిపారు. "కేసులోని మొత్తం 11 మంది దోషులకు ఉపశమనం ఇవ్వాలని కొన్ని నెలల క్రితం ఏర్పాటైన కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు, దీంతో వారి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు నిన్న మాకు అందాయి" అని మాయాత్ర చెప్పారు.

Atal Bihari Vajpayee Death Anniversary: వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ..

ఫిబ్రవరి 27, 2002న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ని తగలబెట్టిన ఘటనలో 59 మంది 'కరసేవకులు' మృతి చెందారు. ఆ తరువాత చెలరేగిన హింసలో.. ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానో, చిన్నారి అయిన తన కూతురు, మరో 15 మందితో కలిసి తన గ్రామం నుండి పారిపోయింది. మార్చి 3న, వారు పొలంలో దాక్కుని ఉండగా,  కొడవళ్లు, కత్తులు, కర్రలతో సాయుధులైన 20-30 మంది గుంపు వారిపై దాడి చేసింది. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దాడిలో ఆమె కుటుంబంలోని ఏడుగురు మరణించారు. మరో ఆరుగురు సభ్యులు పారిపోయారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో నిందితులను 2004లో అరెస్టు చేశారు. దీనిమీద అహ్మదాబాద్‌లో విచారణ ప్రారంభమైంది. అయితే, ఈ కేసులో సాక్షులకు హాని కలిగించవచ్చని, సిబిఐ సేకరించిన సాక్ష్యాలను తారుమారు చేయవచ్చని బిల్కిస్ బానో ఆందోళన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 2004లో కేసును ముంబైకి బదిలీ చేసింది.

ప్రత్యేక CBI కోర్టు జనవరి 21, 2008న బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం,  ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన ఆరోపణలపై పదకొండు మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం గర్భిణీ స్త్రీపై అత్యాచారం, హత్య, చట్టవిరుద్ధంగా సమావేశానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై వారికి శిక్ష పడింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో ప్రత్యేక కోర్టు మరో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. నిందితుల్లో ఒకరు విచారణ సమయంలో మరణించారు. నిందితుల శిక్షను సమర్థిస్తూ 2018లో బాంబే హైకోర్టు ఏడుగురి నిర్దోషుల తీర్పును రద్దు చేసింది.

బిల్కిస్ బానోకు రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, ఇల్లు ఇప్పించాలని 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్వంత్‌భాయ్ నాయ్, గోవింద్‌భాయ్ నాయ్, శైలేష్ భట్, రాధేశం షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్‌భాయ్ వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభాయ్ వోహానియా, రాజుభాయ్ సోనీ, మితేష్ భట్ రమేష్ చందనా అనే 11 మందిని ముందస్తుగా విడుదల చేశారు.

వారిలో ఒకరైన రాధేశ్యామ్ షా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 432, 433 కింద శిక్షను తగ్గించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అతని రిమిషన్‌పై నిర్ణయం తీసుకునే "సముచిత ప్రభుత్వం" మహారాష్ట్ర అని, గుజరాత్ కాదని గమనించిన హైకోర్టు అతని పిటిషన్‌ను కొట్టివేసింది. ఏప్రిల్ 1, 2022 నాటికి తాను 15 సంవత్సరాల 4 నెలలు జైలులో ఉన్నానంటూ షా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్‌లో నేరం జరిగినందున.. , షా దరఖాస్తును పరిశీలించడానికి గుజరాత్ ప్రభుత్వమే తగినదని.. మే 13 నాటి ఉత్తర్వులో సుప్రీం కోర్టు పేర్కొంది.  జూలై 9, 1992 నాటి పాలసీ ప్రకారం ముందస్తు విడుదల కోసం దరఖాస్తును పరిశీలించాలని, రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవచ్చని SC గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

click me!