
బెంగళూరు : అతడికి బైక్ పై రయ్ రయ్ మంటూ చక్కర్ల కొట్టడమంటే చాలా ఇష్టం. దీంతో అతి చిన్న వయసులోనే బైక్ రేసర్ గా మారాడు. ఇలా జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న మైనర్ బాలుడు అదే రేసింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ట్రాక్ పై మెరుపువేగంతో దూసుకుపోతూ ప్రమాదానికి గురవడంతో అతడి ప్రాణాలు దక్కలేవు.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన కొప్పారం శ్రేయస్ హరీష్ కు చిన్ననాటి నుండి బైక్ రేసింగ్ అంటే ప్రాణం. అతడి ఇష్టాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో కేవలం 13ఏళ్ల వయసులోనే జాతీయస్థాయి బైక్ రేసర్ గా మారాడు. ఇప్పటికే హరీష్ చాలా రేసింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు.
అయితే శనివారం మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ పై జరిగిన భారత జాతీయ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్ షిప్ లో హరీష్ పాల్గొన్నాడు. రేస్ ప్రారంభమైన కొద్దిసేపటికే ట్రాక్ పై వేగంగా దూసుకెళుతున్న హరీష్ బైక్ ఓ మలుపు వద్ద అదుపుతప్పింది. బైక్ అత్యంత వేగంగా వెళుతుండగా ప్రమాదం జరిగడంతో రేసర్ హరీష్ తీవ్రంగా గాయపడ్డాడు. హెల్మెట్ ఉన్నప్పటికీ అతడి తలకు బలమైన గాయం కావడంతో నిర్వహకులు వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే హరీష్ ప్రాణాలు కోల్పోయాడు.
Read More విషాదం.. నదిలో పడ్డ బస్సు, ముగ్గురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు
చిన్నవయసులోనే బైక్ రేసర్ గా మారిన కొడుకు ఎదుగుదలను చూసిన ఆ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. హరీష్ మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.