
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి షాక్ తగిలింది. యూపీకి చెందిన బీజేపీ ఎంపీని కోర్టు ఓ వ్యక్తి పై దాడి కేసులో దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో త్వరలోనే ఎంపీ హోదాను కోల్పోబోతున్నట్టు తెలుస్తున్నది.
ఇటావా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రామ్ శంకర్ కటారియాను దోషిగా పేర్కొని రెండేళ్ల జైలు శిక్షను ఆగ్రా కోర్టు విధించింది. 2011లో ఆగ్రాలోని విద్యుత్ సరఫరా కంపెనీ మేనేజర్ పై దాడి చేయడానికి ఓ చిన్ని మూకను కటారియా తన వెంట తీసుకెళ్లాడు. ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 50 వేల జరిమానా కూడా విధించింది.
Also Read: గటగటా నీళ్లు తాగేసింది.. మెదడు వాచిపోయి మరణించింది.. ఏం జరిగింది?
ఈ తీర్పుపై బీజేపీ ఎంపీ రామ్ శంకర్ స్పందిస్తూ.. కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పారు. అయితే, తీర్పును త్వరలోనే పైకోర్టులో సవాల్ చేస్తానని వివరించారు. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన అవసరాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
2014 నవంబర్ నుంచి 2016 జులై వరకు ఆయన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు.