
బీహార్‌లో తొమ్మిది మందిని చంపిన పెద్ద పులిని చంపేశారు. బగాహా ప్రాంతంలో చెరకు తోటలో నక్కిన పులిని హతమార్చారు. నిన్న ఇంటి నుంచి బయటకు వచ్చిన తల్లీబిడ్డను ఈ పులి పొట్టన పెట్టుకుంది. గేదెలకు గడ్డి కోసి తీసుకెళ్లేందుకు తల్లి పదేళ్ల కుమారుడితో అడవి వైపు వచ్చింది. అక్కడే మాటు వేసి వున్న పులి వీరిపై దాడి చేసి చంపేసింది. మూడు రోజులుగా నలుగురిని చంపినట్లగా సమాచారం. మొత్తంగా 12 ఏళ్ల బాలికతో పాటు 9 మందిని ఈ పులి పొట్టనపెట్టుకుంది. దీంతో ప్రభుత్వం పులిని చంపేయాల్సిందిగా షూట్ ఎట్ సైట్ ఆర్డర్ జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన షార్ప్ షూటర్ షఫత్ అలీ ఖాన్‌తో పాటు మరికొంతమందికి దీనిని హతం చేసే బాధ్యత అప్పగించారు. తాజాగా ఆ నరభక్షక పులిని హతమార్చడంతో సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.