బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే రాష్ట్రం ఇదే.. కీలక రిపోర్టు ప్రచురించిన కేంద్ర ప్రభుత్వం

By Mahesh KFirst Published Oct 8, 2022, 5:40 PM IST
Highlights

బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే రాష్ట్రంగా జార్ఖండ్ ఉన్నది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 21 ఏళ్లలోపు పెళ్లి చేసుకుంటున్నవారి శాతం సగానికి ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర హోం శాఖ నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది.

న్యూఢిల్లీ: బాల్య వివాహాలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. కేంద్ర హోం శాఖ నిర్వహించిన తాజా డెమోగ్రఫిక్ శాంపిల్ సర్వే ప్రకారం, 18 ఏళ్లు నిండక ముందే జరుగుతున్న బాలికల వివాహాల శాతం 5.8గా ఉన్నట్టు తేల్చింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఆఫీసు వెల్లడించిన సర్వే కీలక వివరాలు వెల్లడించింది.

‘18 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేసుకున్న వారి శాతం జార్ఖండ్‌లో 5.8 శాతంగా ఉన్నది. జాతీయ స్థాయిలో ఇది 1.9 శాతంగా ఉన్నది. కేరళలో 0.0 శాతం ఉండగా, జార్ఖండ్‌లో 5.8 శాతంగా ఉన్నది’ అని సర్వే తెలిపింది.

జార్ఖండ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. కాగా, పట్టణ ప్రాంతంలో మూడు శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 84 లక్షల మంది జనాభాల శాంపిల్స్ తీసుకుని ఈ రిపోర్టు రూపొందించింది.

జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ రెండు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకున్న వారిలో సగానికి ఎక్కువ మంది మహిళలు 21 ఏళ్లకు లోపు వారే అని సర్వే తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో 54.9 శాతం మంది బాలికలు 21 ఏళ్లకు లోపే పెళ్లి చేసుకున్నట్టు పేర్కొంది. జార్ఖండ్‌లో ఈ సంఖ్య 54.6 శాతం ఉన్నది. కాగా, జాతీయ స్థాయిలో 21 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుంటున్న యువతుల సంఖ్య 29.5 శాతంగా ఉన్నది.

click me!