
బీహార్ : బీహార్లోని అరారియా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఓ జర్నలిస్టు ఇంట్లోకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ జర్నలిస్టు మృతి చెందాడు.
బిమల్ యాదవ్ అనే బాధితుడు దైనిక్ జాగరణ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రాణిగంజ్‌లోని ఆయన నివాసానికి వచ్చిన నలుగురు వ్యక్తులు అతని ఛాతీపై కాల్చారు. యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వెలుగు చూడడంతో పోస్ట్‌మార్టం నిర్వహించే ప్రదేశంలో తీవ్ర కలకలం రేపింది.
పోస్టుమార్టం ప్రదేశంలో ఉద్రిక్తత నెలకొనడంతో పరిస్థితి శృతిమించకుండా చూడడం కోసం.. పోలీసు సూపరింటెండెంట్, ఏరియా పార్లమెంటు సభ్యుడు సహా పోలీసు అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు.
అరారియా ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ‘‘బీహార్‌లోని అరారియాలోని రాణిగంజ్ మార్కెట్ ప్రాంతంలో ఉదయం 5.30 గంటల ప్రాంతంలో దైనిక్ జాగ్రన్‌కు చెందిన విమల్ అనే జర్నలిస్టును నలుగురు వ్యక్తులు కాల్చి చంపారు. సమాచారం అందడంతో ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో శాంతి భద్రతల అమలులో నితీష్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం విఫలమైందని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ మండిపడ్డారు.
బీహార్ ముఖ్యమంత్రి 'బీహార్‌లో నేరాలు ఇతర రాష్ట్రాల కంటే తక్కువ' అన్నారన్న వ్యాఖ్యపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, “నితీష్ కుమార్ ఈ గణాంకాలను కుటుంబ పెద్దలను కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పోలీసు అధికారుల కుటుంబాలకు చూపించాలి. ఇప్పుడు చనిపోయిన ఆ జర్నలిస్టు కుటుంబానికి చూపించాలి” అని వ్యంగ్యస్త్రాలు విసిరారు.