
బిహార్ శాసనసభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించింది. బిహార్ ఎన్నికలను రెండు విడుతల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ప్రకటించారు.
ఈ మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతమైనట్లు ప్రకటించారు.
ఎస్సీలకు 38, ఎస్టీలకు 2 సీట్లు కేటాయించారు. మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 శాతం వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. 14 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
బిహార్‌లో శాసనసభలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎన్నికలు పలు విడతల్లో జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఎన్నికల సంఘం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
ఈసారి బిహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా మొదటిసారిగా కొన్ని కొత్త విధానాలకు వేదిక కానున్నాయి. ముఖ్యంగా ఈవీఎంలలో అభ్యర్థుల రంగు ఫొటోలు కలిగిన బ్యాలెట్ పేపర్లు అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలన్న ఆలోచనలో కూడా ఎన్నికల సంఘం ఉందని స్పష్టమైంది.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి ఆధిక్యం రాకపోవడంతో జేడీయూ–భాజపా కూటమి ఏర్పడి నీతీశ్ కుమార్ సీఎం అయ్యారు. కానీ రెండేళ్లకే ఆయన ఎన్డీయే నుంచి బయటికి వచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాగఠ్‌బంధన్‌లో చేరారు. ఆ బంధం ఎక్కువ కాలం నిలవకపోవడంతో 2024 జనవరిలో మళ్లీ జేడీయూ ఎన్డీయేతో కలసి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రస్తుతం నీతీశ్ మరోసారి ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు.