
Green Card: అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి శుభవార్త. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు కొన్ని రోజుల ముందు బిడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో నివసించడానికి, పని చేయడానికి గ్రీన్ కార్డ్‌ల కోసం ఎదురుచూస్తున్న వారి అర్హత ప్రమాణాలపై పాలసీ మార్గదర్శకాలను జారీ చేయడం ద్వారా నిబంధనలను సడలించింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
దీంతో అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ప్రయోజనం చేకూరనున్నది. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ప్రయోజనం చేకూరనున్నది. గ్రీన్ కార్డుల జారీ విషయంలో అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ చేసిన మార్గదర్శకాలు వేలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులకు సహాయపడతాయని భావిస్తున్నారు.
గ్రీన్ కార్డ్ లేదా పర్మినెంట్ రెసిడెన్సీ కోసం ఏటా లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. 'గ్రీన్ కార్డ్' అధికారికంగా స్థానిక నివాస కార్డుగా పిలువబడుతుంది. ఇది యునైటెడ్ స్టేట్స్‌కు వచ్చే వలసదారులకు జారీ చేయబడిన పత్రం, దాని హోల్డర్‌కు శాశ్వత నివాసం ఏర్పార్చుకునే అవకాశముంటుంది. గ్రీన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా నూతన మార్గదర్శకాలు వర్తింపచేయనున్నట్లు అమెరికా వెల్లడించింది.
ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 140,000 ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌లు జారీ చేయబడతాయి. అయితే.. ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్య (కోటా) ప్రకారమే గ్రీన్ కార్డులు మాత్రమే ఇవ్వబడతాయి. ప్రస్తుత విధానం ప్రకారం ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయించాలన్నది. ఈఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడీ నిబంధనలను సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతు ఇవ్వనున్నట్టు వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది అజయ్ భూటోరియా తెలిపారు. ఈ నిర్ణయంలో అమెరికాలో చట్టబద్ధంగా పని చేసే వారి సంఖ్య పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.
ఈ నిర్ణయాన్ని ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIDS) ప్రశంసించింది. FIDS ప్రకారం.. ఈ చర్య పెద్ద సంఖ్యలో భారతీయ IT నిపుణులకు సహాయం చేస్తుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుండి జూన్ 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ 22న మోదీ గౌరవార్థం ఆయనకు జోబైడెన్ దంపతులు, వైట్ హౌజులో విందు ఇవ్వనున్నారు. అలాగే.. జూన్ 22న అమెరికా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.