
ఇప్పటికే పలు దేశాలు కరోనాపై పోరులో భాగంగా బూస్టర్ డోస్ (booster dose) టీకాలు వేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే భారత్‌లో బూస్టర్ డోస్ అందుబాటులో లేదు. తాజాగా బూస్టర్ డోస్‌కు సంబంధించి కొవాగ్జిన్‌ను తయారు చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ (Bharat Biotech) వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా (Krishna Ella) కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పొందిన ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవడం సరైనదని చెప్పారు. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
బూస్టర్ డోస్ అంశంపై భారత్ బయోటెక్ మరింత లోతుగా చర్చ జరుపుతుందని అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం, కొంతమంది నిపుణులు బూస్టర్ డోస్ అత్యవసంర కాదని అభిప్రాయపడుతున్నట్టుగా చెప్పారు. రెండ్ డోసులు వ్యాక్సిన్ అందజేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మరోవైపు కొన్ని దేశాలు.. వారి దేశాల్లోని వృద్దుల కోసం బూస్టర్ డోస్‌లు వేయడం ప్రారంభించాయని గుర్తుచేశారు. టైమ్స్ నౌ సమ్మిట్ 2021లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also read: ఇండియాలో కూడా కోవిడ్-19 టాబ్లెట్.. త్వరలోనే మోల్నుపిరవిర్ అత్యవసరం వినియోగానికి అనుమతి..!
Covaxin తర్వాత.. భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న నాసికా టీకా (nasal vaccine) (ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు వ్యాక్సిన్) గురించి కూడా కృష్ణ ఎల్లా మాట్లాడారు. నాసికా టీకా ఫేజ్ 2 ట్రయల్స్ పూర్తైనట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు. మరో 3 నుంచి నెలల్లో దానిని ఆశించవచ్చని చెప్పారు. భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ చేయడానిక కోవిన్ ప్లాట్‌ఫారమ్ వినియోగించడం గురించి ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్టుగా ఆయన తెలిపారు.
తొలి డోస్ కొవాగ్జిన్ తీసుకున్నవారికి రెండో డోస్ కింద నాసికా టీకా ఇచ్చే విషయం ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు. రెండో డోస్ నాసికా టీకా ఇస్తే వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుంటుందని అన్నారు. ఊపిరితిత్తుల పైభాగానికి చేరుకోని ఇంజెక్ట్ చేయగల వ్యాక్సిన్‌తో పోలిస్తే ఇన్‌ఫెక్షన్‌ను నివారించడంలో నాసికా టీకా మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని అన్నారు. అది మాస్క్ ధరించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు.
Also read: ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు: నిన్నటి కంటే 14 శాతం కేసుల పెరుగుదల
కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ జాప్యం గురించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. భారత్‌లో కొవాగ్జిన్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతికూల ప్రచారం వెనక రాజకీయ కారణాలు ఉండవచ్చని అన్నారు. భారతీయ విజ్ఞానం, ఆవిష్కరణలు, ‘ఆత్మనిర్భర్’ సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కోవాక్సిన్ టీకాను ఎంత త్వరగా తీసుకున్నారో గుర్తుచేసుకున్నారు. వ్యతిరేక ప్రచారంలో జాప్యం జరిగిందని.. కానీ చివరకు నిజాయితీగా తాము విజయం సాధించామని చెప్పారు.