
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య తీరుతో వేగలేకున్నామని, అందరినీ వేధిస్తున్నదని ఆరోపించాడు. ఇంట్లో ఒక్క పని కూడా చేయదని తెలిపాడు. వయోవృద్ధురాలైన తన తల్లి వంట చేస్తుంటే తిని వేధిస్తున్నదని వాపోయాడు. మధ్యాహ్నం 12.30 గంటల దాకా పడుకుని.. నిద్ర లేస్తున్నదని అన్నాడు.
కమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బసవనగూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య ఆయేషా ఫర్హాన్ మధ్యాహ్నం 12.30 గంటల దాకా పడుకుంటున్నదని ఆరోపించాడు. ఇంటిలో తన భార్య వంట చేయడం లేదని తెలిపాడు. వయసు మీద పడ్డ తన తల్లి స్వయంగా వంట చేస్తున్నదని, ఆమెనే అందరికీ వడ్డిస్తున్నదని వివరించాడు. వీటన్నింటినీ తాము భరించామని, కానీ, ఇప్పుడు తమ కుటుంబ సభ్యులపై ఆమె దాడి చేయడం కూడా ప్రారంభించిందని తెలిపాడు.
Also Read: వలస కార్మికులపై దాడికి సంబంధించిన ఫేక్ వీడియో షేర్ చేసిన బీహార్ వ్యక్తి అరెస్ట్
తమ కుటుంబం మొత్తాన్ని వేధిస్తున్న భార్య, ఆమె కుటుంబంపై యాక్షన్ తీసుకోవాలని కమ్రాన్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. రాయల్ లైఫ్ కోసమే తనను పెళ్లి చేసుకున్నదని కమ్రాన్ ఖాన్ తెలిపాడు. ఇటీవలే ఆమె బర్త్ డే జరిగిందని, ఆ చిన్న కార్యక్రమానికి 25 మంది అతిథులను ఆహ్వానించిందని పేర్కొన్నాడు. తమ కుటుంబ సభ్యులపై దాడి చేసిందని వివరించాడు. తన భార్యను భరించడం అందరికీ కష్టంగా మారిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.