Bengaluru:కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఏకకాలంలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణం ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భయపడాల్సిన అవసరం లేదని కర్ణాటక సీఎం తెలిపారు.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో పాఠశాలలపై బాంబులు వేస్తామని బెదిరింపు ఇమెయిల్ రావడంతో కలకలం రేగింది. దీంతో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో భయం నెలకొంది. వ్యవహారంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను టీవీ చూస్తున్నానని, మా ఇంటికి ఎదురుగా ఉన్న పాఠశాలకు కూడా బెదిరింపు మెయిల్ వచ్చింది.. విచారణకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించి పాఠశాలల్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయో లేదో పరిశీలించారు. అలాగే బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలలన్నింటికీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లను పంపించారు. ఈ ముప్పును ఎదుర్కొన్న పాఠశాలల్లో వైట్‌ఫీల్డ్, కోరమంగళ, బసవేష్‌నగర్, యలహంక, సదాశివనగర్‌లోని పాఠశాలలు ఉన్నాయి. విషయం తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
'భయపడాల్సిన అవసరం లేదు': కర్ణాటక సీఎం
బెంగళూరులోని పలు పాఠశాలలపై బాంబు దాడి చేస్తామని బెదిరింపు రావడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 'పోలీసులు దర్యాప్తు చేస్తారు, భద్రతా చర్యలు తీసుకున్నారు. తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పాఠశాలలను తనిఖీ చేసి భద్రత పెంచాలని పోలీసులను ఆదేశించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి ప్రాథమిక నివేదిక వచ్చిందని తెలిపారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కర్నాటక హోం మంత్రి
కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, కొన్ని స్కూళ్లకు ఈమెయిల్ బెదిరింపులు వచ్చాయని, ఆ ఇమెయిల్ మూలాన్ని ధృవీకరిస్తున్నారనీ, దానిని తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, దర్యాప్తు చేయాలని తాను పోలీసులకు తెలియజేశానని వెల్లడించారు. ఇది చాలా హేయమైన చర్య అనీ, ఈ చర్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. బాంబు బెదిరింపులు ఎదుర్కొంటున్న పాఠశాలలన్నింటిలోనూ బాంబు స్క్వాడ్‌లతో తనిఖీ చేయించామని మంత్రి తెలిపారు. దీంతో పాటు బెదిరింపు మెయిల్స్ పంపిన వారి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.