కరోనా నీడలో.. బెంగాల్ ఎన్నికలు ప్రారంభం

By telugu news teamFirst Published Apr 17, 2021, 9:05 AM IST
Highlights

ఇదిలా ఉండగా.. బెంగాల్ లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. చివరి మూడు విడతల పోలింగ్ ను ఒకే రోజు నిర్వహిస్తారంటూ వార్తలు వచ్చాయి.

పశ్చిమ బెంగాల్ ఐదో విడత ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో ఈ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. 

దీంతో ఇక్కడ ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలని టీఎంసీ, పట్టు సాధించాలని బీజేపీ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ప్రచారంలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా రెండు పార్టీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రచార సమయంలో తీవ్ర ఘర్షణలూ చెలరేగాయి.

కాగా, రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గానూ ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతలలో 135స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఇంకా పోలింగ్ జరగాల్సిన స్థానాలు 159.  ఐదో విడతలో 45 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది.

ఇక పోలింగ్ జరగనున్న 45 నియోజకవర్గాలు ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. పోలింగ్ లో పాల్గొనబోయే ఓటర్లు 1.12 కోట్లు. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 15,789. 319 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థినుల సంఖ్య 39.

ఇదిలా ఉండగా.. బెంగాల్ లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. చివరి మూడు విడతల పోలింగ్ ను ఒకే రోజు నిర్వహిస్తారంటూ వార్తలు వచ్చాయి. కాగా.. ఆ వార్తలను ఎన్నికల కమిషన్ కొట్టేసింది. ఈ నెల 22, 26, 29 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలకు ఒకే దశలో నిర్వహించాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే.. నేడు ఐదో విడత పోలింగ్ ప్రారంభమయ్యింది.

click me!