కేసీఆర్‌‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్.. వేగంగా మారుతున్న పరిణామాలు.. త్వరలోనే విపక్షల సీఎంల భేటీ!

Published : Feb 14, 2022, 01:21 PM IST
కేసీఆర్‌‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్.. వేగంగా మారుతున్న పరిణామాలు.. త్వరలోనే విపక్షల సీఎంల భేటీ!

సారాంశం

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్ష సీఎంలు పోరుకు సిద్దమవుతున్నారు. ఎన్డీయేతర సీఎంలును ఎకతాటిపైకి వచ్చి కేంద్రంపై పోరు సాగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే దేశంలోని విపక్ష పార్టీలను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేలా ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. 

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్ష సీఎంలు పోరుకు సిద్దమవుతున్నారు. ఎన్డీయేతర సీఎంలును ఎకతాటిపైకి వచ్చి కేంద్రంపై పోరు సాగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే దేశంలోని విపక్ష పార్టీలను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేలా ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. కేంద్రంలోని మోదీ సర్కార్‌ తీరువల్ల రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విపక్ష సీఎంలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ, అధికార దుర్వినియోగం‌ ఎక్కువైందంటూ వీరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల సీఎంల సమావేశం నిర్వహించేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. సమాఖ్య స్పూర్తిని కాపాడాలనే లక్ష్యంతో వీరు ముందుకు సాగుతున్నారు. కలిసి వచ్చేవారితో ముందుకు సాగుతామని సంకేతాలు పంపుతున్నారు. 

ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో ప్రధానంగా ప్రస్తవిస్తున్నారు. దేశంలోని రాజకీయ శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని గద్దె దించాలని కోరుతున్నారు. దేశంలో రాజకీయ ఫ్రంట్ కాదని.. ప్రజల ఫ్రంట్ వస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనతో మాట్లాడరని.. బెంగాల్‌కు ఆహ్వానించారని చెప్పారు. తాను త్వరలోనే ముంబై వెళ్తానని.. సీఎం ఉద్దవ్ ఠాక్రే‌ను కలుస్తానని చెప్పారు. బీజేపీ వ్యతిరేక పోరులో కీలక పాత్ర పోషిస్తానని తెలిపారు. 

కేసీఆర్, స్టాలిన్‌తో మాట్లాడాను.. మమతా బెనర్జీ
మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇదే రకమైన ప్రకటన చేశారు. బీజేపీకి పోరు కొనసాగిస్తామని చెప్పిన మమతా బెనర్జీ.. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌కు మంచి సంబంధాలు లేవని అన్నారు. కాంగ్రెస్ దారితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌‌తో ఫోన్‌ ద్వారా మాట్లాడినట్టుగా చెప్పారు. దేశ సమాఖ్య నిర్మాణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. విశాల ప్రయోజనాల దృష్ట్యా టీఎంసీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయలేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తాము మర్యాదపూర్వకంగా ముందుకు సాగాలని.. సామాన్య ప్రజల కోసం పనిచేయాలని చెప్పారు. 

త్వరలో సమావేశం.. 
రాష్ట్రాలలో గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ, అధికార దుర్వినియోగంపై చర్చించేందుకు ప్రతిపక్ష రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు త్వరలో ఢిల్లీలో సమావేశం కానున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ సమావేశాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించినట్లు తెలిపారు. 'బిజెపి యేతర పాలిత రాష్ట్రాల గవర్నర్‌లు రాజ్యాంగ ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగంపై మమతా బెనర్జీ నాకు స్వయంగా ఫోన్‌ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని ఆమె సూచించారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని నిలబెట్టేందుకు డీఎంకే కట్టుబడి ఉంటుందని నేను ఆమెకు హామీ ఇచ్చాను. ఢిల్లీ నుంచి త్వరలో విపక్షల సీఎంల సమావేశం ఉంటుంది’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు. 

బెంగాల్ గవర్నర్‌పై స్టాలిన్ ఆగ్రహం..
పశ్చిమ బెంగాల్‌‌లో అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ శాసనసభను ప్రొరోగ్‌ చేశారంటూ సీఎం స్టాలిన్‌ మండిపడ్డారు. ఆదర్శంగా ఉండాల్సిన గవర్నర్‌ సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై కూడా మమతా బెనర్జీ.. స్టాలిన్‌కు ఫోన్ చేసినప్పుడు చర్చించినట్టుగా సమాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?