
Karnataka Hijab row: దేశవ్యాప్తంగా హిజాబ్ వివాదంపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయంలో కర్ణాటక పేరు అంతర్జాతీయంగా మారుమోగుతోంది. కర్ణాటకలోని ఉడుపి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల మధ్య తల్లెత్తిన హిజాబ్ వివాదం ఇప్పుడూ చిలికి చిలికి గాలి వానగా మారింది. దేశ సరిహద్దులు దాటి.. అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం ఇప్పుడూ యావత్ భారతం అట్టుడికిస్తోంది. ఓ వైపు హిజాబ్ అనుకూల, మరోవైపు ప్రతికూల ఆందోళనలు జరగడంతో హిజాబ్ ఆంశం మరింత వివాదస్పదంగా మారుతోంది. దీంతో వివాదం ఓ రోజుకో మలుపు తిరుగుతోంది.
ఈ వివాదంపై రాజకీయ నాయకులు తమదైన శైలిలో స్పందిస్తూ.. చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. హిజాబ్ తప్పనిసరి కాదని, కానీ, ఈ ఆచారాన్ని చాలా సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నారన్నారు. అంతేకాదు, మహిళలు తమ అందాన్ని దాచుకోకపోవడం వల్లే అత్యాచారాలకు గురవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై కర్నాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ హిజాబ్ వ్యవహారం కుట్రగా మారుతోంది. హిజాబ్ లేని వ్యక్తులపై అత్యాచారాలు జరుగుతున్నాయని మీ ఉద్దేశమా? ఈ దేశ పౌరులకు తమకు నచ్చిన దుస్తువులను ధరించవచ్చు. నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు. కానీ, విద్యాసంస్థల నిబంధనల అనుకునంగా విద్యార్థులు నడుచుకోవాలని, పాఠశాలలో మాత్రమే యూనిఫాం ఉండాలని స్పష్టం చేశారు. ఈ దేశంలో అత్యాచారాలు జరిగితే.. ఎలా మనుగడ సాగిస్తున్నారని అని ప్రశ్నించారు. ఇది జమీర్ అహ్మద్ అభిప్రాయం మాత్రమేనని అన్నారు. హిజాబ్ అంశాన్నిఅంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఇతర దేశాల ముందు భారతదేశాన్ని కించపరచాలని, దేశ ప్రతిష్టను నశనం చేయాలనే కుట్ర జరుగుతోందని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఆరోపించారు.
హిజాబ్ వివాదంలో పిటిషన్ దాఖాలు చేసిన వారి సమాచారం తమ దగ్గర ఉందనీ, వారికి కొన్ని ఉగ్ర సంస్థలతో అనుబంధముందని సమాచారం వచ్చిందనీ, ఈ వివాదాన్ని మరింత రెచ్చగొడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటకలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని హోంమంత్రి ప్రజలకు తెలిపారు. మత సామరస్యం దెబ్బతిన కుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అరాచక ప్రకటన చేస్తుందని, తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో (నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) ఎన్ఐఏ విచారణ అవసరమని ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘుపతి భట్ అన్నారు.