
2008 ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా హాజరయ్యారు. మరోవైపు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) నేత బిలావల్ భుట్టో జర్దారీ, ఆయన సోదరీమణులు బక్తావర్, ఆసిఫా కూడా అక్కడే ఉన్నారు. వీరంతా చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు బీజింగ్‌కి వెళ్లారు.
ఆ సమయంలో ఈ రెండు రాజకీయ కుటుంబాలు సుమారు 30 నిమిషాల పాటు ఒక ప్రైవేట్ సమావేశం జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ, బెనజీర్ భుట్టో హత్య విషయమై భుట్టో కుటుంబానికి సానుభూతి తెలిపినట్లు చెబుతారు.
అయితే, అప్పట్లో మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, చైనా కమ్యూనిస్టు పార్టీ (CPC) మధ్య ఒక "ఎంఓయూ" కుదిరిందని వార్తలు వచ్చాయి. ఇందులో రాజకీయ, విదేశీ, రహస్య వ్యూహాలపై చర్చలు జరిపే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పటికీ ఆ ఎంఓయూ విషయాలు బయటపెట్టలేదు.
17 ఏళ్ల తర్వాత ఆ సమావేశం ఫోటో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. దీనితో మళ్లీ రాజకీయ ప్రశ్నలు వస్తున్నాయి. అది నిజంగా కేవలం ఓ సానుభూతి భేటీనా? లేదా ఏదైనా చర్చలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్, పాకిస్థాన్‌ల మధ్య అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న సమయంలో, చైనాలో ఈ రెండు దేశాల వారసత్వ రాజకీయ కుటుంబాల భేటీపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భేటీపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పందించలేదు. దీంతో ప్రతిపక్షాల విమర్శలు పెరిగాయి. చైనా ఇలాంటి సమావేశాల ద్వారా రెండు దేశాల రాజకీయాల్లో పరోక్షంగా జోక్యం చేసుకుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. 17 ఏళ్లు గడుస్తోన్నా కాంగ్రెస్ ఈ విషయంపై ఇప్పటికీ స్పందించకపోవడంతో అనుమానాలకు ఊతమిచ్చినట్లవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.