బీబీసీకి సంచలనమే ముఖ్యం.. మోడీపై డాక్యుమెంటరీ దుర్మార్గం.. సుప్రీం తీర్పుకూ విరుద్ధం: 302 మంది ప్రముఖుల లేఖ

By Mahesh KFirst Published Jan 21, 2023, 6:49 PM IST
Highlights

302 మంది ప్రముఖులు బీబీసీ తీసిన ఇండియా: ది మోడీ కొశ్చన్ అనే డాక్యుమెంటరీని తప్పుపట్టారు. అది వాస్తవానికి దూరంగా ఉన్నదని, ఉద్దేశపూర్వక అబద్ధాలతో మోడీపై బురదజల్లే ప్రేరేపణతో తీసినట్టుగా ఉన్నదని తెలిపారు. గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు స్పష్టంగా వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా తీశారని వివరించారు.
 

న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన బీబీసీ పై 302 మంది భారత ప్రముఖులు విరుచుకుపడ్డారు. ఇండియా: దది మోడీ కొశ్చన్ అనే వివాదాస్పద డాక్యుమెంటరీ తీసిన బీబీసీని రిటైర్డ్ ఉద్యోగులు, న్యాయమూర్తులు, సైనిక అధికారులు తప్పుపట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు నడుస్తున్న 75 ఏళ్ల స్వతంత్ర, ప్రజాస్వామిక దేశమైన ఇండియా ఉనికినే ఈ డాక్యుమెంటరీ శంకిస్తున్నదని, ఊహాత్మక రిపోర్టింగ్ ఆధారంగా ఈ సిరీస్ తీశారని వారు పేర్కొన్నారు.

ఈ లేఖ పై మొత్తం 302 మంది ప్రముఖులు సంతకాలు పెట్టారు. అందులో 133 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, 13 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 156 మంది రిటైర్డ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ అధికారులు ఉన్నారు. ఈ సంతకాలు పెట్టిన వారు బీబీసీ డాక్యుమెంటరీ పూర్తిగా కల్పిత కథ ఆధారంగా తీశారని ఆరోపించారు. ‘స్పష్టమైన తప్పిదాలు ఒకవైపు ఉండగా.. ఆ సిరీస్‌లో తరుచూ ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు, ఇతరులు పేర్కొన్నట్టుగా చూపే వ్యాఖ్యలే తరుచూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక దుర్మార్గమైన, భ్రాంతికర, ఉద్దేశపూర్వక అవాస్తవాలు ఉన్నట్టు చెబుతున్నాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే భారత అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టంగా గుజరాత్ అల్లర్లపై వెలువరించిన తీర్పునూ ఖాతరు చేయలేదు. అందుకు విరుద్ధంగా చిత్రణ సాగింది. గుజరాత్ 2002 అల్లర్లలో నరేంద్ర మోడీ పాత్ర లేదని, అప్పటి ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఇందులో లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

Also Read: ఇండియా: ది మోడీ కొశ్చన్.. ఆ బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం!

సాధారణంగానే సంచలనాలను ఆలంబనగా చేసుకుని ఎదుగుతున్న బ్రిటీష్ మీడియా సంస్థ బీబీసీ సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కనబెట్టి.. అది ఎంతో అవాస్తవమైనప్పటికీ సెకండ్ గెస్సింగ్‌తో డా్యుమెంటరీ తీశారని విమర్శించారు. ఇది స్పష్టంగా బీబీసీకి ఉన్న దురుద్దేశ లక్ష్యాన్ని బహిరంగపరుస్తున్నదని, ఈ సిరీస్ వెనుక వేరే ప్రేరేపణలు ఉన్నాయని వెల్లడిస్తున్నదని ఆరోపించారు.

అంతేకాదు, ఈ డాక్యుమెంటరీ ఒక తటస్థ విమర్శతో లేదని, ఇది సృజనాత్మక స్వేచ్ఛను పాటించినట్టు కాదని వారు స్పష్టం చేశారు. కనీసం వ్యవస్థ వ్యతిరేక వైఖరి అని కూడా చెప్పలేమని వివరించారు. ఇది ఒక తోటి భారత పౌరుడిని, దేశ భక్తుడిని, మన దేశ నాయకుడికి వ్యతిరేకంగా ప్రేరేపితంగా తయారు చేసిన ఒక అభియోగ పత్రంగా ఉన్నదని తెలిపారు. మీరు ఎవరికి ఓటు వేసిన దేశ ప్రధానమంత్రే మీకు ప్రధానమంత్రి అవుతారని, కాబట్టి, ఉద్దేశపూర్వక అబద్ధాలతో తమ నేతపై తప్పుగా చిత్రించిన డాక్యుమెంటరీని ఎంతమాత్రం ఆమోదించబోమని తెలిపారు. కొన్ని సాంకేతిక పదాల వెనుకదాగి తప్పుడు వ్యాఖ్యానాన్ని రూపొందించే ప్రయత్నం ఈ డాక్యుమెంటరీ ద్వారా జరిగిందని పేర్కొన్నారు.

click me!