ఇండియా: ది మోడీ కొశ్చన్.. ఆ బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం!

By Mahesh KFirst Published Jan 21, 2023, 5:46 PM IST
Highlights

2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ మన దేశంలో స్క్రీనింగ్ కాకుండా నిషేధం విధించారు. కానీ, ఈ డాక్యుమెంటరీ వీడియోలను ట్విట్టర్, యూట్యూబ్‌లలో షేర్ చేశారు. వీటిని బ్లాక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
 

న్యూఢిల్లీ: బ్రిటీష్‌కు చెందిన బీబీసీ గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లపై ఓ డాక్యుమెంటరీ తీసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న సంగతి విధితమే. ఈ డాక్యుమెంటరీ నరేంద్ర మోడీ పాత్రనూ ప్రతికూలంగా తీర్చిదిద్దినట్టు ఆరోపణలు వచ్చాయి. బీబీసీ తీసిన ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం విమర్శించింది. అదొక దుష్ప్రచార డాక్యుమెంటరీ అని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ కొట్టివేసిన సంగతి తెలిసిందే. భారత దేశంలో ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ పై నిషేధం విధించింది.

తాజాగా, ఆ డాక్యుమెంటరీ లింక్‌ను షేర్ చేసిన ట్విట్టర్, యూట్యూబ్ పోస్టులను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందుకే ఇండియా: ది మోడీ కొశ్చన్ అనే బీబీసీ డాక్యుమెంటరీని షేర్ చేసిన ట్వీట్లు, వీడియో షేరింగ్ వెబ్‌సైట్ పోస్టులు అందుబాటులో లేకుండా పోయాయి.

బీబీసీ తీసిన ఈ డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్‌ పోస్టులను బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్‌లను ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌క్యాస్టింగ్ మినిస్ట్రీ ఆదేశించినట్టు కొన్ని వర్గాలు వివరించాయి. ఈ డాక్యుమెంటరీ షేర్ చేస్తూ చేసిన 50 ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్‌ను ఆదేశించినట్టు తెలిపాయి. 

Also Read: గుజరాత్ అల్లర్లపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీ ఒక ప్రాపగాండ.. పీఎం మోడీపై బురదజల్లే యత్నం: కేంద్రం

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దెరెక్ ఓబ్రియన్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఈ డాక్యుమెంటరీని షేర్ చేశారు. వారి ట్వీట్లను తొలగించినట్టు తెలిసింది. దీనిపై ఓబ్రియన్ స్పందించారు కూడా. ‘సెన్సార్షిప్. నా బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్‌ ను ట్విట్టర్ తొలగించింది. తన ట్వీట్‌కు లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రధానమంత్రి మైనార్టీలను ఎలా ద్వేషిస్తారో ఆ ఒక్క గంట డాక్యుమెంటరీ స్పష్ట పరుస్తుంది’ అని పేర్కొన్నారు.

ఐటీ రూల్స్ 2021 పరిధిలోని ఎమర్జెన్సీ పవర్‌లకు లోబడి ఐఅండ్ బీ మినిస్ట్రీ చేసిన ఆదేశాలను యూట్యూబ్, ట్విట్టర్ అంగీకరించినట్టు ఆ వర్గాలు తెలిపాయి.

click me!