
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించి, ఇంత కాలం కుటుంబ సభ్యులకు చేరని మృతదేహాతల్లో కొన్ని ఎట్టకేలకు తమ ఆత్మీయుల వద్దకు చేరాయి. భువనేశ్వర్ ఎయిమ్స్ లో భద్రపర్చిన 13 మృతదేహాలను శనివారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. డీఎన్ఏ నమూనాల ద్వారా గుర్తించిన 29 మృతదేహాల్లో శుక్రవారం ఆరు, శనివారం 13 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
డీఎన్ఏ పరీక్ష ఫలితాల ఆధారంగా భువనేశ్వర్ ఎయిమ్స్, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), జీఆర్పీ సమన్వయంతో ఇది జరిగిందని వెల్లడించారు. 13 మృతదేహాల్లో నాలుగు బీహార్ కు, ఎనిమిది పశ్చిమ బెంగాల్ కు, ఒకటి జార్ఖండ్ కు పంపినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ట్విట్టర్ యూజర్లకు షాక్.. చదివే పోస్టులపై పరిమితులు విధించిన ఎలాన్ మస్క్.. ఎవరెవరికీ ఎంతంటే ?
బాధితులు వచ్చే వరకు మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతుందని, భువనేశ్వర్ ఎయిమ్స్ లోని కంటైనర్లలో ఇంకా 62 మృతదేహాలు గుర్తుపట్టకుండా భద్రపరిచామని అధికారులు తెలిపారు. షాలిమార్-చెన్నై వెళ్లే కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదంలో 293 మంది మృతి చెందారు. ఇందులో 287 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు.
బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో జూన్ 2 సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా విషాదం రేకెత్తించింది. 1,200 మందికి పైగా గాయపడ్డారు. బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వెంటనే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు విచ్చలవిడిగా పడిపోయాయి. కొన్ని కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌పైకి పడ్డాయి. తర్వాత కొంతసేపటికే యశ్వంత్‌పూర్ నుంచి హౌరాకు వెళుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన కోచ్‌లను ఢీకొట్టడంతో.. ఆ రైలులోని కొన్ని బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు పట్టాలపై అవయవాలు లేని మృతదేహాలు, రక్తపాతాలు కనిపించిన పలు భయానక, బాధాకరమైన దృశ్యాలు బయటపడ్డాయి.