దుస్తులు మార్చుకునేందుకు వాష్ రూమ్ కు వెళ్లిన పలువురు విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురయ్యింది. వారు బట్టలు మార్చుకునే సమయంలో రహస్యంగా వీడియో రికార్డింగ్ జరిగింది. ఈ విషయం బాధితులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఐఐటీ - ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఫెస్ట్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఫ్యాషన్ ప్రజెంటేషన్ కోసం దుస్తులు మార్చుకునేందుకు 10 మంది విద్యార్థినులు వాష్ రూమ్ కు వెళ్లారు. అయితే అక్కడ రహస్యంగా వీడియో తీశారని ఢిల్లీ యూనివర్సిటీలోని భారతి కాలేజీకి చెందిన విద్యార్థినులు ఆరోపించారు. దీనిపై వారు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతకు ముందు బాధిత విద్యార్థినులు సోషల్ మీడియా వీడియోల ద్వారా తమ గోడు వెల్లబోసుకున్నారు. వాష్ రూమ్ కు వెళ్లిన సమయంలో రహస్యంగా వీడియో రికార్డింగ్ చేశారని, ఈ విషయం యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
We need Serious Action on this!!! pic.twitter.com/WNrM4K4von
— sneha (@literarywarfare)
ఈ ఘటనపై కిషన్ గఢ్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టి 20 ఏళ్ల కాంట్రాక్ట్ స్వీపర్ అయిన నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 354సీ కింద కేసు నమోదు చేసుకొని, నిందితుడిని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.
అయితే దీనిపై ఐఐటీ ఢిల్లీ స్పందించింది. ఇలాంటి ఘటనను సహించేది లేదని ఒక ప్రకటన విడుదల చేసింది. పరిస్థితిని అధికారులకు నివేదించామని పేర్కొంది. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని తెలిపింది. కాగా.. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఈ ఘటనను ఖండించింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.