
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణం జరిగింది. ఓ కారు వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. అనంతరం దానిని మూడు కిలో మీటర్ల పాటు అలాగే ఈడ్చుకెళ్లింది. ఆ బైక్ ఉన్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను మరొకరు వీడియో తీయగా.. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
నాగ్ పూర్ విమానాశ్రయానికి వెళ్లే వార్ధా రోడ్డులోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ప్రైడ్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఓ బైక్ పై రాకేష్ గేట్, ఆకాష్ టేకం ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో ఓ కారు వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. అయితే కారు డ్రైవర్ వాహనాన్ని ఆపలేదు. బైకర్లను అలాగే ఈడ్చుకుంటూనే వెళ్లాడు.
ఇలా మూడు కిలోమీటర్ల పాటు వెళ్లిన తరువాత ఆ బైక్ పై ఉన్న ఇద్దరూ తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం వారిని స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఆ కారు బైక్ ను ఢీకొట్టడం, ఈడ్చుకెళ్లడంగా అటుగా వెళ్తున్న ఓ బైకర్ వీడియో తీశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవడంతో పోలీసులకు చేరింది.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. గుర్తు తెలియని కారు డ్రైవర్ పై సోనేగావ్ పోలీస్ స్టేషన్ లో రాష్ డ్రైవింగ్ తో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వాహనాన్ని, నిందితుడిని త్వరలోనే కనుగొంటామని సోనేగావ్ పోలీసులు తెలిపారు.