Assam: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు సీఎం హిమంత బిశ్వ శర్మ అధ్యక్షతన సమావేశమైన ఆ రాష్ట్ర మంత్రివర్గం .. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) చట్టాన్ని తీసుకరావాలనే దిశగా ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం 1935ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
Assam: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అస్సాంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) చట్టాన్ని తీసుకరావాలనే దిశగా తొలి అడుగు వేసింది. సీఎం హిమంత శర్మ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ , విడాకుల నమోదు చట్టం 1935ని రద్దు చేయాలని నిర్ణయించింది. అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశలో తీసుకున్న మొదటి అడుగుగా పరిగణిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
కేబినెట్ మీటింగ్ అనంతరం అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇలా ట్విట్ చేశారు. 'ఫిబ్రవరి 23, 2024న శతాబ్దాల నాటి అస్సాం ముస్లిం వివాహాలు- విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేస్తూ అస్సాం క్యాబినెట్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం చట్టం ప్రకారం.. వధూవరులు నిర్ణీత ( ఆడవారికి 18 ఏళ్లు, మగవారికి 21 ఏళ్లు) వయస్సు నిండకుండా.. వివాహ నమోదును అనుమతించే నిబంధనలను కలిగి ఉంది. ఈ నిబంధన అస్సాంలో బాల్య వివాహాలను ప్రేరేపిస్తోంది. దీంతో బాల్య వివాహాలను నిషేధించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అని ట్విట్ చేశారు.
కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర మంత్రి జయంత మల్లాబార్వా మాట్లాడుతూ.. యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అమలు దిశగా ఇదొక ముందడుగు అని పేర్కొన్నారు. ముస్లిం వివాహాలు, విడాకులకు సంబంధించిన అన్ని విషయాలను ప్రత్యేక వివాహ చట్టం ద్వారా నియంత్రించవచ్చని ఆయన నొక్కి చెప్పారు. కొత్త నిర్మాణంలో ముస్లిం వివాహాలు, విడాకుల నమోదుకు ఇప్పుడు జిల్లా కమీషనర్లు, జిల్లా రిజిస్ట్రార్లు బాధ్యత వహిస్తారని తెలిపారు.
రద్దయిన చట్టం కింద పనిచేస్తున్న 94 మంది ముస్లిం రిజిస్ట్రార్‌లను కూడా వారి పోస్టుల నుంచి రిలీవ్ చేసి రూ.2 లక్షలు ఒకేసారి చెల్లించనున్నట్టు తెలిపారు. తాజా నిర్ణయం బాల్య వివాహాలను తగ్గించడంలో దోహదపడుతుందని అన్నారు. కాగా, కులం, మతం, ప్రాంతంతో సంబంధంలేకుండా అన్ని అంశాల్లోనూ అందరికీ ఒకే రకమైన చట్టం వర్తింపజేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ నెల 7న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.