Today Top News:100 ఎకరాల్లో కొత్త హైకోర్టు భవన నిర్మాణం..మాజీల భద్రత తొలగింపు.. భారత్ ఘన విజయం

By Rajesh Karampoori  |  First Published Dec 15, 2023, 5:38 AM IST

Today Top News:  రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనం నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిగాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అలాగే.. భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు టీ20 మ్యాచ్ లో  అతిథ్య జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం సౌతాఫ్రికా 95 పరుగులకే ఆలౌటైంది. మరో ముఖ్యాంశాలు మీ కోసం.. 


Today Top News: 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు భవన నిర్మాణం..

Telangana High Court: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనం నిర్మాణానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో సీఎం రేవంత్ రెడ్డి,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయస్థానాల స్థితిగతులు, వసతులు తదితర అంశాలపై వీరు చర్చించారు.  

Latest Videos


 మాజీల భద్రత తొలగింపు

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ పాలనలో దూకుడు పెంచింది. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రేవంత్ ప్రభుత్వం .. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై దృష్టి సారించింది. తాజాగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు వున్న భద్రతను తొలగించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. సర్కార్ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రత కలిపిస్తున్న సాయుధులైన పోలీసులను వెనక్కి పిలిచారు ఉన్నతాధికారులు. ఎవరెవరికి భద్రత అవసరం అనే దానిపై సమీక్ష అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా వీరిలో కొందరికి భద్రత పునరుద్ధరించే అవకాశం వుంది. 


కరాచీ బేకరీలో ఘోర ప్రమాదం.. సీఎం రేవంత్ దిగ్బ్రాంతి..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారీ పేలుడు సంభవించింది. రాజేంద్ర నగర్ లోని ప్రముఖ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి మరింత విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఈ  ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కార్మికులున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.


టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌( టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు.ఈ మేరకు సిట్టింగ్‌ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాశారు.  

రేవంత్ సర్కారులో ఐఏఎస్ ఆమ్రపాలి 

యంగ్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆమెను కేంద్ర సర్వీసుల్లో నుంచి తెలంగాణకు రప్పించుకుంది. తాజాగా ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జాయింట్ కమిషనర్‌గా, మూసీ నది అభివృద్ది కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది రేవంత్ సర్కార్.


నేటీ నుంచి జీరో టికెట్లు

TSRTC Zero Tickets: ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో భాగంగా నేటీ నుంచి మహిళలకు జీరో టికెట్లను మెషిన్ల ద్వారా జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. జీరో టికెట్లను విధిగా తీసుకుని సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు తప్పకుండా తమ వెంట ఆధార్, ఓటర్, పాన్, ఇతర గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకదానిని తెచ్చుకోవాలని కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం సాయంత్రం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు.  

95 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. భారత్ ఘన విజయం

జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు టీ20 మ్యాచ్ లో  అతిథ్య జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం సౌతాఫ్రికా 95 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో ముగిసింది.

click me!