
Asianet News : భారతదేశ మీడియా రంగంలో ఏసియా నెట్ న్యూస్ కి ప్రత్యేక స్థానం ఉంది. నిజాలను నిర్భయంగా బయటపెడుతూ, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ మళయాళీ ప్రజలను ఎంతో చేరువయ్యింది ఈ న్యూస్ ఛానల్. ఈ మీడియా దిగ్గజం ప్రస్థానం ప్రారంభమై నేటికి (సెప్టెంబర్ 30) కి సరిగ్గా 30 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఛానల్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఏసియా నెట్ న్యూస్ 30 ఏళ్ళ ప్రయాణాన్ని పూర్తిచేసుకోవడం సంతోషధాయకం... ఈ క్రమంలో ఈ ఛానల్ తో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలాగే ఈ ఛానల్ జర్నీలో భాగస్వామ్యం అయిన ప్రేక్షకులు, దీని మంచిని కోరుకునేవారికి కూడా తన విషెస్ తెలియజేస్తున్నానని ప్రధాని అన్నారు.
ఏసియానెట్ న్యూస్ ప్రజలకు సమాచారాన్ని అందించడంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందని...తనదైన శైలిలో వార్తలను ప్రసారం చేస్తుందని ప్రధాని కొనియాడారు. ప్రజలకు అనేక విషయాలపై పరిజ్ఞానం కూడా అందిస్తుంది... ఇలా సామాజిక, జాతీయపరమైన అంశాలపై చైతన్యం కలిగిస్తుందని అన్నారు. స్థానిక మీడియాలాగే కనిపిస్తున్నా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ ఛానల్ ఎంతో చేస్తోందని ప్రధాని మోదీ కొనియాడారు.
గత మూడు దశాబ్దాలుగా ఏసియా నెట్ న్యూస్ కేరళ ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని ప్రధాని అన్నారు. ఇది కేవలం జర్నీ మాత్రమే కాదు సమాజానికి చేస్తున్న సేవను తెలియజేస్తుందని అన్నారు. ఏసియా నెట్ 30 ఏళ్ళ సక్సెస్ జర్నీని పూర్తిచేసుకున్న సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇలాగే ఏసియా నెట్ న్యూస్ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటన్నానని ప్రధాని మోదీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసారు.
మలయాళ మీడియా వ్యవస్థతో ఏసియా నెట్ న్యూస్ ఓ సంచలనం... ఇది న్యూస్ అందించే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇలా ఏషియానెట్ న్యూస్ ప్రసారాలు మొదలుపెట్టి నేటికి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి. 1995 సెప్టెంబర్ 30న సాయంత్రం ఏడున్నర గంటలకు చరిత్ర సృష్టించిన మొదటి ప్రసారం జరిగింది. భారతదేశంలో మొదటిసారిగా ఒక వార్తా ప్రసారం ప్రత్యక్షంగా జరిగింది. ఇలా మలయాళీలకు సరికొత్త అనుభూతినిచ్చిన ఆ క్షణం నేటికి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.
అప్పట్లో భారతదేశంలోని ప్రైవేట్ ఛానెళ్లకు శాటిలైట్‌లతో అప్-లింకింగ్ సౌకర్యం ఉండేది కాదు. అందుకే విదేశాల నుండి ప్రత్యక్ష ప్రసారాలను అందించింది ఏసియా నెట్. అయితే 1999లో భారతదేశంలో అప్-లింకింగ్ అనుమతించడంతో మొదట తమిళనాడులోని కొరట్టూర్ నుంచి, ఆ తర్వాత కొద్దికాలానికే తిరువనంతపురం నుంచి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 2009లో ఏసియానెట్ న్యూస్ కాస్త ఏసియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఒక స్వతంత్ర ఛానెల్‌గా అవతరించింది. ఈ రోజు కేవలం టెలివిజన్ రంగంలోనే కాకుండా వివిధ భాషల డిజిటల్ రంగంలో కూడా ఏషియానెట్ న్యూస్ పేరు బలంగా నిలిచింది.