అయోధ్యలో రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం అవుతుంది. మసీదు నిర్మాణం మాత్రం ఇంకా ప్రారంభమే కాలేదు. మసీదు నిర్మాణం ఏ దశలో ఉన్నది? ఎందుకు జాప్యమైంది? అనే విషయాలను ఐఐసీఎఫ్ వెల్లడించింది.
Ayodhya Mosque: రామజన్మ భూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినప్పుడు రామ మందిరానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు అయోధ్యలోనే మరో చోట మసీదు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసింది. బాబ్రీ మసీదు స్థలానికి బదులు అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో స్థలం కేటాయించారు. అప్పుడే ఇక్కడ మసీదు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ఓ మాడ్రన్ డిజైన్‌ను కూడా విడుదల చేసింది. మసీదుతోపాటు దాని ప్రాంగణంలో ఓ హాస్పిటల్, లైబ్రరీలను కూడా నిర్మిస్తామని పేర్కొంది. ఈ నెల 22న అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరంలో రామ్ లల్లా కొలువుదీరనున్నారు. రామ మందిరం భక్తుల కోసం ప్రారంభం కాబోతున్నది. ఈ నేపథ్యంలోనే అదే అయోధ్యలో నిర్మాణం కావాల్సిన మసీదు గురించీ ఆసక్తి ఏర్పడుతున్నది.
అయోధ్యలో మసీదు నిర్మాణం మే నెలలో ప్రారంభం అవుతుందని ఐఐసీఎఫ్ చీఫ్ ట్రస్టీ జుఫర్ ఫరూఖీ తెలిపారు. ఇందుకోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయని వివరించారు. ‘ఫౌండేషన్ వెబ్ సైట్ తయారీలో ఉన్నది. ఫిబ్రవరిలో అందుబాటులోకి రావొచ్చు. ఈ వెబ్ సైట్ ప్రారంభం కాగానే దాని ద్వారా మసీదు నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రారంభం అవుతుంది. ఇందుకోసం క్యూఆర్ కోడ్ వంటి సులభ విధానాలను ఏర్పాటు చేస్తున్నాం’ అని ఫరూఖీ వివరించారు.
undefined
Also Read: Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?
మసీదు నిర్మాణంలో జాప్యం జరిగిన విషయాన్ని అంగీకరించిన ఫరూఖీ.. ఇందుకోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించాల్సి వచ్చిందని, ఇందువల్లే అధికంగా ఆలస్యం జరిగిందని వివరించారు. ఈ కొత్త ప్లాన్‌లో మసీదుతోపాటు హాస్పిటల్, లైబ్రరీ, ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ డిజైన్లను అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీకి ఫిబ్రవరిలో సమర్పిస్తామని వివరించారు.
‘ఆ తర్వాత మసీదు నిర్మాణం ప్రారంభిస్తాం. మసీదు కోసం విరాళాల సేకరణ తర్వాతే శంకుస్థాపన చేయగలం. మసీదు మ్యాప్‌కు ఆమోదం లభించాలి.’ అని ఫరూఖీ తెలిపారు. ‘ధన్నిపూర్ గ్రామంలో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మిస్తాం. తొలుత ఈ విస్తీర్ణం 15 వేల చదరపు అడుగులుగానే ఉంది. తొలుత భారత సాంప్రదాయ మసీదు రూపం ఆధారంగా డిజైన్ తయారైంది. అయితే, ఆ డిజైన్ తిరస్కరణకు గురైంది. ట్రస్టీ సభ్యులు పలు సవరణలు చేపట్టడంతో కొత్త డిజైన్ కోసం సమీక్ష ప్రారంభించాం. ఈ కొత్త డిజైన్ ఇప్పుడు ప్రిపరేషన్‌లో ఉన్నది. సవరించిన డిజైన్ కూడా అవసరమైన అధికారుల అనుమతులను పొందాల్సి ఉంటుంది.’ అని ఫరూఖీ వివరించారు.
ఐఐసీఎఫ్ ప్రతినిధి ఆథర్ హుస్సేన్ మాట్లాడుతూ.. హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా తమ మసీదు ఉండాలని ఆశపడుతున్నామని వివరించారు.