
Punjab Assembly Election 2022: ఈ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో గురువారం తొలి దశ పోలింగ్ ప్రారంభం కాగా, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక పంజాబ్ లో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ (ఆప్) సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తుంది.
ఈ క్రమంలోనే ఆప్ పంజాబ్ లో ఎన్నికల ప్రచారం ముమ్మరం కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన భార్య సునీత, కుమార్తె హర్షితలు కూడా పంజాబ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే వారంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు శుక్రవారం వారు పంజాబ్‌కు రానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేజ్రీవాల్ భార్య ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
"రేపు నేను నా బావ భగవంత్ మాన్ కోసం ఓట్లు అడగడానికి నా కుమార్తెతో కలిసి ధురీ (సంగ్రూర్ జిల్లాలో) ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాను" అని కేజ్రీవాల్ భార్య సునిత ట్వీట్ చేశారు.
ఫిబ్రవరి 11న పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా ధూరిలో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్ధి భగవంత్ మాన్ నిర్వహించే జన్ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత, కుమార్తెలు హాజరవుతారని ఆప్ వర్గాలు సైతం వెల్లడించాయి. భగవంత్ మాన్ తల్లి, సోదరితో పాటు ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ కుమార్తె కూడా పాల్గొంటారు. కాగా, ధూరి నుంచి ఎన్నికల బరిలో నిలిచిన భగవంత్ మాన్‌ను.. ఫోన్‌లైన్ సర్వేలో 93 శాతం మంది అనుకూలంగా ఓటు చేయడంతో ఆయనను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సంగ్రూర్ స్థానం నుంచి ఆ పార్టీ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.
ప్రస్తుతం జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆప్ బలమైన పోటీ దారుగా ఉంది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచనప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్టింది ఆప్. ఏకంగా 20 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఆప్ కొనసాగుతోంది. భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆప్ కు ప్రజల నుంచి అద్బుతమైన స్పందన వస్తున్నదని తెలిపారు. పంజాబ్‌లో ఆప్‌ని గెలవనీయకుండా ఆపేందుకు బీజేపీ, అకాలీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరీ 14 జరగాల్సి ఉన్నాయి. అయితే, ఆ రోజు గురు రవిదాస్ జయంతి కావడంతో.. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంతో ఫిబ్రవరీ 20 కి మార్చింది. పంజాబ్‌లోని 117 నియోజకవర్గాల్లో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.