ఐదో దఫా కూడ ఈడీ విచారణకు న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దూరమయ్యారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదో దఫా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ(ఈడీ) విచారణకు హాజరు కావడం లేదు. శుక్రవారం నాడు విచారణకు రావాలని ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ కూడ ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు తనకు సమన్లు జారీ చేయడం చట్ట విరుద్దమని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యమని ఆమ్ ఆరోపించింది.
అయితే ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. తనను తాను అమాయకుడిగా చిత్రీకరించుకొనేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. చంఢీఘడ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడిందని ఆప్ ఆరోపిస్తుంది. ఈ విషయమై ఇవాళ బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపునిచ్చింది. మరో వైపు ఆప్ ప్రధాన కార్యాలయం ముందు బీజేపీ కూడ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఆప్ ప్రధాన కార్యాలయం ముందు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చండీఘడ్ మేయర్ ఎన్నికలపై నిరసన విషయంలో బీజేపీ ఎందుకు భయపడుతుందని ఆప్ మంత్రి అతిషి ప్రశ్నించారు.