
న్యూఢిల్లీ: 2011 నుంచి గతేడాది వరకు సుమారు 16 లక్షల మంది భారత పౌరులు తమ పౌరసత్వాన్ని వదిలిపెట్టుకున్నారు. అప్పటి నుంచి అత్యధికంగా గతేడాదే భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2020లో ఈ సంఖ్య(85,256) తక్కువగా ఉన్నది. ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పౌరసత్వాన్ని త్యజించుకున్న వారి సంఖ్య సంవత్సరాలవారీగా వివరాలు వెల్లడించారు.
2015లో 1,31,489 మంది ఇండియన్లు తమ పౌరసత్వాన్ని వదులుకోగా, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని విడిచిపెట్టుకున్నారు. 2018లో ఈ సంఖ్య 1,34,561గా ఉండగా, 2019లో 1,44,017గా, 2021లో 1,63,370 మంది ఇండియన్ సిటిజెన్‌షిప్‌ను వదిలేసుకున్నారు. కాగా, 2022లో గరిష్టంగా 2,25,620 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని విడిచిపెట్టుకున్నారు.
Also Read: 41 మంది భారతీయులకు గతేడాది పాకిస్తాన్ పౌరసత్వం.. ఈ సంఖ్య ఎందుకు పెరిగింది?
కాగా, రిఫెన్స్ కోసం కేంద్ర మంత్రి జైశంకర్ 2011 (1,22,819), 2012 (1,20,923), 2013 (1,31,405), 2014 (1,29,328)ల వివరాలనూ ఆయన వెల్లడించారు.
ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వం తీసుకున్న భారతీయులు ఎంత మంది ఉన్నారని అడగ్గా.. గత మూడేళ్లలో యూఏఈ పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య ఐదు అని సమాధానం ఇచ్చారు. అలాగే, ఇక్కడ పౌరసత్వం వదిలిపెట్టి వారు సిటిజెన్‌షిప్ పొందిన 135 దేశాల జాబితానూ ఆయన వెల్లడించారు.