
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు స్థానంలో సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నియమితులయ్యారు. కీలక కేంద్ర మంత్రుల్లో ఒకరిగా పేరొందిన రిజిజుకు తక్కువ కీలకమైన ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. క్యాబినెట్ హోదాతో న్యాయ మంత్రిత్వ శాఖకు పదోన్నతి పొందిన ఏడాదిలోపే ఈ పరిణామం జరగడం గమనార్హం.
ప్రధాని సలహా మేరకు ఈ మార్పులు జరిగినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. ‘‘కిరణ్ రిజిజు స్థానంలో సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నియమితులయ్యారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న శాఖలకు అదనంగా న్యాయ, న్యాయ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖను కిరణ్ రిజిజుకు కేటాయింపు జరిగింది’’ అని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
న్యాయశాఖ కొత్త మంత్రికి సంబంధించిన ముఖ్య విషయాలు
- అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
- 14 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన రాజస్థాన్ లోని బికనీర్ నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు.
- అర్జున్ రామ్ మేఘ్వాల్ కు 2013లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.
- 2014 లోక్ సభ ఎన్నికల్లో బికనీర్ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికయ్యారు.
- రెండోసారి ఎంపీగా ఎన్నికైన తరువాత అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో బీజేపీకి చీఫ్ విప్ గా పని చేశారు.
- అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ నుండి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లో ఆయన 2.64 లక్షల ఓట్ల తేడాతో కాంగ్రెస్‌కు చెందిన మదన్ గోపాల్ మేఘ్‌వాల్‌పై గెలుపొందారు.
- మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆయన.. సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.
- ఆయన 'భాభీ జీ' క్రిస్ప్స్ (పాపాడ్) ప్రారంభిస్తూ.. ఈ పాపడ్ కరోన్ వైరస్ ను తరమికొట్టడంలో సహాయపడుతుందని, ఇమ్యూనిటీ పవర్ పెరగడంలో సాయం చేస్తుందని చెబుతూ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ సమయంలోనే ఆయన వార్తల్లో నిలిచారు.
కాగా.. కిరణ్ రిజిజును న్యాయశాఖ నుండి తొలగించడంపై పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. శివసేన (యూబీటీ).. పేర్లు చెప్పకుండా ఇటీవల వచ్చిన కోర్టు తీర్పుల గురించి ప్రస్తావించింది. ఈ కారణంగానే కిరణ్ ను న్యాయశాఖ నుండి తొలగించారా అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత అల్కా లాంబా కూడా ఈ మార్పుపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టను కాపాడుకొనేందుకు రిజిజు నుంచి న్యాయశాఖను తొలగించిందని ఆమె ఆరోపించారు.